పుట:Telugu merugulu.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తెలుఁగు మెఱుఁగులు

తెలుగుఁ దనము-తెలుగు సంప్రదాయము

తెలుగువా రన్నను. అంధ్రు లన్నను ఒకరే అన్న యెఱుకతో మాటాడుచున్నాను. తెలుగు సంప్రదాయ మన్నను తెలుగుతన మన్నను, ఆంధ్రసంప్రదాయ మన్నను ఆంధ్రత్వ మన్నను ఒకటే అని నా తలపు.

"ఆంధ్రద్రవిడ కర్నాటా మహారాష్ట్రాశ్చ గుర్జరా!" ఈ అయిదు జాతులవారుసు పంచద్రావిడు లని ప్రాచీనులు పేర్కొన్నారు. ప్రాచీన కాలమునందు, నిప్పుటికిగూడ, ఈ యయిదుజాతులవారికిని ఆచార వ్యవహారములు, ఆహారవిహారములు, కవితాగానములు, కులమర్యాదలు కొంత కొంత సరిపోలుచునే ఉన్నవి. ఔత్తరాహులయిన పంచగౌడులకు "సారస్వతాః కాన్యకుబ్జ గౌడా ఉత్కలమైధిలాః" అని పేళ్లు. వారు చాల విధములందు పంచద్రావిడులతో భేదింతురు. పంచద్రావిడులలో నేడు, ఆంధ్ర ద్రవిడకర్నాటులు మాత్రమే అత్యధిక సంబంధముగలవారుగా ఉన్నారు. కాని. ప్రాచీన కాలమున, అనగా రెండువేల యేండ్లకుముందు, సాతవాహనులును ఇక్ష్వాకులును పాలించిననాళ్లలో మహారాష్ట్రులు, గుర్జరులుకూడ ఈ మూడు జాతులతో చాల సన్నిహిత సంబంధముగలవారై యుండెడివారు. ఆంధ్రుల నేటి యాహార సంప్రదాయమే పంచద్రావిడులయు నాహారసంప్రదాయ మని శంకరాచార్యాదులు రచించిన పూజాస్తోత్రముల లోని నైవేద్య క్రమవర్జనశ్లోకములను బట్టి గుర్తింపవచ్చును. శాల్యన్నము, నెయ్యి, పప్పు, కూరలు, పచ్చళ్లు, దప్పళము, పెఱుగు ప్రధానాహార పదార్ధములుగా శ్లోకము లున్నవి. ఇప్పటికిని ఆంధ్రులయాహార పధ్ధతి ఇదేకదా.