పుట:Telugu Talli 1937 11 01 Volume No 1 Issue No 6.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆంధ్రరాష్ట్ర మహాసభా సమావేశము

అక్టోబరు 25, 26, 27, తేదులలో బెజవాడయందు బ్రహ్మాండమగు సభలు జరిగినవి. రాయలసీమ వాసులను గొందఱిని పిలిచికొనివెళ్లి అసాధారణ మన్ననల దనిపి ఉత్తరాంధ్రులు తమపని నెఱవేరినదని తమ్ముదామభినందించుకొని మురిసిరి. ఏడుచుబిడ్డకు వెలగపండును జూపినట్లు సమయోచితముగ ననేక వాగ్దానములు జేసిరి;- ధన్యులు.

    "ఎప్పటికెయ్యది ప్రస్తుత
     మప్పటికామాటలాడి యన్యులమనముల్
     నొప్పింపక తానొవ్వక
     తప్పించుక తిరుగువారు".

ఆంధ్రరాష్ట్రము మనకందఱకుగావలయునని యున్నది. కాని, ఇదివఱకు రాయలనాటి ప్రజల విరసించి యధ:కరించి ద్వేషబీజముల మహావృక్షము లగునంతవఱకు బెంచి పెద్దసేసి యుండిన సంగతి ఏనుగులనెక్కి యూరేగిన నాయకులు మఱచినారనిన నది వారి దోష మెట్లగును? మహాభారతము శాంతిపర్వమున దిక్కయజ్వ

    "నెయ్యము సెడిననుమాటల
     తియ్యదనమువట్టి పగమదిన్ మరచినజా
     వయ్యెం జేటయ్యె గలక
     యయ్యె నొకటిమూడుగాక యదిమేలగునే?