సొఖిమేళం
సొఖిమేళం అనే కళారూపం ఆంధ్ర దేశంలో ఎక్కడా కనిపించదు. కాని ఒరిస్సా సరిహద్దుల్లో వున్న అయా పట్టణాల్లోనూ, పల్లెలలోనూ పైన పేర్కొన్న సోఖిమేళాన్ని ప్రదర్శిస్తూ వుండేవారు. కళాకారులందరూ ఆంధ్రదేశంలో స్థిరపడిపోయిన ఒరియావారు. దీనిని బట్టి బహుశా ఈ కళారూపం ఒరిస్సాలో బహుళ ప్రచారంలో వుండవచ్చును. ఈ మేళం పేరు సోఖి మేళం. అంటే సఖీ మేళం అనీ దీని అర్థం. ఈ మేళం మన ప్రాంతాల్లో ప్రదర్శించే దేవదాసీ మేళం లాంటిది. వివాహ సమయాల్లో మేజువాణీలు భోగంవారు ఎలా చేసేవారో వీరూ అలాగే చేస్తారు. ఇంతకూ ఈ మేళంలోని వారందరూ యుక్త వయస్సులో నున్న యువకులు స్త్రీ పాత్ర ధరిస్తారు. అందరూ ఇరవై సంవత్సరాల లోపు వారే. వారి స్త్రీ పాత్ర వేషధారణ యవ్వనంలో వుండే మిటమిటలాడె అంద కత్తెల అందచందాల్ని మించి వుండేది. వారి స్త్రీ పాత్రల వేష ధారణకూ, అభినయానికి పురుషులందరూ ముగ్ధులై పోయి మేళంలోని వారందరూ స్త్రీలే నన్నంత భ్రమలో పడిపోయేవారట. వారు కొన్ని ఒరియా పాటలు పాడినా, ఎక్కువగా తెలుగు పాటలనే పాడుతారట.
ముఖ్యంగా వివాహ సమయాల్లోనూ, వుత్సవాల సమయాల్లోనూ ప్రదర్శనలిస్తారు. వీరు ఎంతో శ్రావ్యంగ పాడుతారు... సోఖిమేళ ప్రదర్శనమంటే ప్రజలు తండోప తండాలుగా విరగబడి చూసేవారని, ఆ ప్రదర్శనాలను దర్శించిన సెట్టి ఈశ్వరరావు గారు తెలియ జేస్తున్నారు.
ఈ మాదిరి కళా రూపాన్నే పగటి వేష ధారియైన సున్నపు వీరయ్య గారి పగటి వేషాల పరంపరలో మన ప్రాంతపు భోగం మేళాన్ని ప్రదర్శించే వారు. అచ్చంగా పైన ఉదహరించి సోఖిమేళానికి నకలుగా వుండేది. అంత అద్భుతంగానూ ప్రదర్శనం వుండేది. ఆ విధంగా వీరయ్యగారు తప్ప మరి ఒకరు ప్రదర్శించేవారు కారు.
అలాంటిదే సోఖి మేళం. ఈ కళా రూపానికి ఆ ప్రాంతాలలో కూడ అంతగా ఆదరణ లేక పోవడం వల్ల కనుమరుగైనా ఒకప్పుడు ఒరియా సరిహద్దు ప్రాంతపు ఆంధ్ర ప్రజలందర్నీ అలరించిన కళారూపం.