పలు కళారూపాలను వర్ణించిన పాల్కురికి సోమన్న
మొదటి ప్రతాపరుద్రుని కాలంలో జీవించిన పాల్కురికి సోమనాథుడు, కాకతీయ యుగంలో గొప్ప విప్లవ కవిగా వర్థిల్లాడు. బసవ పురాణంలోను, పండితారాధ్యచరిత్రలోను ఆయన ఆ నాటి విశేషాలను ఎన్నో తెలియ జేశాడు. కళారూపాల ద్వార వీర శైవమతాన్ని ఎలా ప్రచారం చేసింది వివరించాడు. ఆ నాడు ఆచరణలో వున్న అనేక శాస్త్రీయ నాట్య కళా రూపాలను గూర్చి, దేశి కళారూపాలను గూర్చీ వివరించాడు.
- బసవ పురాణం చెప్పిన భక్తి పాటలు:
సోమనాథుని కాలానికి ముందే తుమ్మెద పదాలు, పర్వత పదాలు, శంకర పదాలు, నివాశిపదాలు, వాలేశు పదాలు, వెన్నెలపదాలు మొదలైన వెన్నో ఆచరణలో వుండేవి. కాని, ఈ పదాలన్నీ క్రమంగా నశించటం వల్ల జనసామాన్యంలో విద్యా ప్రచారానికి అవకాశాలు చాల వరకు తగ్గి పోయాయి. ప్రజల్లో ఎక్కువమంది పాటలకే ప్రాముఖ్యమిచ్చినట్లు బసవపురాణం లో ఈ క్రింది విధంగా ఉదహరించ బడింది.
మేటియై చను భక్తకూటువలందు - పాటలుగా గట్టి పాడెడు వారు,
ప్రస్తుతోక్తుల గద్యపద్య కావ్యముల విస్తారముగజేసి వినుతించు వారు,
అటుగాక సాంగభాషాంగక్రియాంగ-వటునాటకంబుల నటియించు వారు,
మునుమాడి వారు వీరనవనేలకూడి-కనుగొన రోళ్ళ రోకళ్ళ బాడెదరు.
భక్తకూటువులనే భజనమండలి సమాజాలు పాటలు కట్టి పాడుకోవడం, రోకటి పాటలు కట్టి పాడుకోవడం (రోకటి పాటలంటే దంపుళ్ళ పాటలు) ఆ నాటికే ఏర్పడ్డాయి. ఈ నాటికి ఈ పాటలు ప్రజాసామాన్యంలో దంపుళ్ళ పాటలు గాను, భజన సమాజాల్లో భక్తి గీతాలుగాను ఏర్పడి ఉన్నాయి. రోకటి పాటలను శివభక్తులు