పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/650

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ పండరి భజనల్ని బాలబాలికలు చేస్తున్నప్పుడు, వారి వేషాలనూ, నృత్యాన్నీ, పాటలనూ వింటున్న ప్రేక్షకులు సంతోషంతో చూస్తూ వుంటారు. కొందరు పూలమాలల్ని వారి మెడల్లో అలంకరిస్తారు. కొందరు రూపాయలిస్తారు. మరి కొందరు ఈలలతో, కేకలతో కేరింతలు కొడతారు. కొంతమంది నేర్పిన గురువు మెడలో పూలమాలలు వేసి కొత్తబట్టలతో సత్కరిస్తారు. ఈ భజనను అనంతపురం జిల్లాలో వ్వాపింప చేసిన వారిలో ధర్మవరానికి చెందిన, ధర్మవరం వెంకటరాముడు ప్రముఖుడు. ఈయన ఆ ప్రాంతపు పల్లెల్లో భజనలు

నేర్పుతూ ఆడుతూ, పాడుతూ, ఆ దేవదేవుణ్ణి తలుస్తూ జీవితాన్నీ సాగిస్తున్నాడని డా॥ చిగిచర్ల కృష్ణారెడ్డి వారి జానపద నృత్యకళలో వివారించారు.


చెమ్మచెక్క చారిడేసి మొగ్గ


చెమ్మ చెక్క
చారిడేసి మొగ్గ
అట్లు బోయంగ
ఆరగించంగ

అంటూ ఆడపిల్లలు అన్ని పండగల్లోనూ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ నలుగురు ఆడపిల్లలు కలిస్తే చాలు, ఈ చెమ్మ చెక్క ఆటను ఎదురు బొదురుగా నిలబడి, చేతులు చాచి, ఒకరి చేతులు మరొకరికి తాటిస్తూ, ఎగురుతూ, గెంతుతూ, వెనకకు ముందుకూ వూగుతూ, అడుగుల లయకు చేతులు తట్టుతూ, పాతలు పాడుతారు. రంగు రంగుల దుస్తులతో వలయాకారంగా, వరుస తప్పకుండా నృత్యం చేస్తూ వుంటే, రంగ రంగ వైభోగంగా వుంటుంది. మధ్య మధ్య, ఒకరి కొకరు ప్రశ్నకు సమాధానంగా ఇలా ప్రారంభిస్తారు.

ధిమిత - ధిమిత
ఏమి ధిమిత? పసుపు ధిమిత
ఏమి పశుపు? తోట పసుపు
ఏమి తోట? ఆకుతోట?
ఏమి ఆకు? తమలపాకు
ఏమి తమ్మ? పుట్ట తమ్మ.