Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/620

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వీరిని ఆరె వాళ్ళని, ఆరుకాపులనీ, అరె మారాఠీలని అర్య క్షత్రియులనీ, వివిధ పేర్లతో పిలుస్తున్నారు. వీరు ప్రాచీన కాలం నుంచీ ఆయుధోపజీవులుగా వున్నట్లు కనిపిస్తున్నారనీ, శాంతి సమయంలో నాగలి పట్టి నేల దున్నటం, యుద్ధ సమయంలో కత్తిబట్టి కదనరంగంలో క్షాత్ర తేజస్సును ప్రదర్శించడం వీళ్ళకు అనువంశిక సంప్రదాయమైనట్లు కనిపిస్తున్నదనీ వివరిస్తున్నారు.

గొంధళే వీథి భాగోతాలు:

ఆరె వాళ్ళు గ్రామాలలో అరె భాషలో... వీథి భాగోతాలను ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనాలను ఆరె వారితో పాటు, తెలుగు వారు కూడ ఆదరిస్తున్నారు.

ఆరెవారిలో అంబీర__ ఇంగ్లే __ గుండేకారి __ గుగై __ దూదాటి షేక్ నారా __ సింధే __అనే ఇంటి పేర్లు గల గొంధళీ కుటుంబాలు సుమారు రెండు వందలదాకా తెలంగాణా జిల్లాలలో వున్నట్లు జగన్నాథం గారు తెలియజేస్తున్నారు.

ముఖ్యంగా వీరంతా మహాలింగంపల్లె__ వరి కోలు __ వేములపల్లి __ కోయలాయ __ వెంకటాపురం __ అలాగే కరీంనగర్ జిల్లాలలోని గోపాలపురం జోజూనూరుపల్లి మొదలైన గ్రామాలలో వున్నారు. రంగస్థల కళాకారులైన వారు ఎక్కువగా మహాలింగంపల్లెలో వుంటున్నారు. ఈ గ్రామానికి సోమదేవరపల్లి అని కూడ మరో పేరు వుంది.