పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/60

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నుంచీ ప్రజాసామాన్యం యెక్క అభిమానాన్ని చూరగొన్నవి. దేశీనాటక సాంప్రదాయాలు చాలవరకు శివకవులు ఆధ్వర్యంలోనో వర్థిల్లాయి. అవి బహుజన రంజకంగానూ, తేలిక పద్ధతిలోను సామాన్య ప్రజలకు అర్థమయ్యే శైలిలోనూ వ్రాయబడ్డాయి. ఆనాడు ఆర్య సాంప్రదాయం ప్రకారం నాటకాలాడే నటకులను పంక్తి బాహ్యులుగా నిర్ణయించారు. అటువంటి వారికి సంఘంలో గౌరవ మర్యాదలు శూన్యం.

అందరూ ఆదరించిన దేశినాటకాలు

కాని శైవ మతాన్ని అవలంబించిన వారికి గాని, ఏ విధమైన జాతివివక్షణా లేని జంగాలకు గాని ఇటువంటి నిర్ణయాలను, విధి నిషేదాజ్ఞలను వారు పాటించలేదు. అంతే గాక శైవమతాన్ని అవలంబించిన బ్రాహ్మణాది అగ్ర వర్ణాల వారికి కూడ ఏ విధమైన పట్టింపూ లేక పోవడం వల్ల అగ్ర జాతుల వారందరూ దేశీ నాటకాలనే ప్రదర్శించారు.

ఇక్కడ గమనించవలసిన విషయ మేమంటే శైవ భక్తులైన జంగాలు మొదలైన వారు శివ సంబంధమైన కథా ఇతివృత్తాలనే తీసుకొని రచనలు సాగించారు. వేరు కథా వస్తువుల్ని వారు స్వీకరించ లేదు. నాటకాలాడడంలో జంగము వారు ముఖ్యులని కృష్ణ దేవరాయల కాలంలో వున్న బైచరాజు వేంకటనాథ కవి 'కడివోని తెఱ నాటకపు టూరిజంగాలు ' అని పేర్కొన్నాడు.

పై విషయాన్ని బట్టి శైవ సంబంధమైన ఇతి వృత్తాలు గల నాటకాలే ప్రథమంగా వ్రాయబడ్డాయని చెప్ప వచ్చు.

వైష్ణవమతం - కళా పోషణ:

పదకొండవ శతాబ్ధంలో దేవాలయ నిర్మాణంలో పెంపు కలిగింది. అంత వరకూ ఒక గర్భ గృహమూ, అంతరాళికమూ, ముఖమండపాలాతో వున్న దేవాలయాలలో ప్రధాన దైవాలకే కాక, పరివారాలకు కూడ గృహాలేర్పడ్డాయి. పన్నిద్దరాళ్వారులను విష్ణు భక్తులు పన్నెండవ శతాబ్ధంలో విష్ణ్వాలయాలలో విగ్రహా రూపంగా ప్రవేశించారు. దేవాలయ విన్యాసాలలో కళ్యాణ మండపం, సభా మండపం, నాట్య మండపం, మొదలైన అనేక మండపాలు అంతర్భాగా లైనాయి. నాట్య, సంగీత, చిత్రకళా నిలయమై దేవాలయం ఒక కళా పోషక సంస్థ ఐంది.