- నిజం చెప్పే నిజాయితీ పరులు:
తాటాకులు కట్టుకుని మరొకరికి తాటాకులు కడుతూ, నా పేరు మూర్ఖుడని తనకు తానే ఎద్దేవా చేసుకుంటూ హేళన చేస్తారు. నిజానికి ఇలా ఎద్దేవా చేయడం, ధైర్యంతో కూడుకున్న విషయం, అయితే అమ్మ వారి ముందు చెప్పటం వల్ల వాటిని గురించి ఎవరూ అంతగా పట్టించు కోలేరు.
మనకు తెలిసిన తొలి నాటకం వాలకమే నంటారు రాంభట్ల గారు. త్రిపుర దహనం ఆయిన తరువాత గెలిచిన వారు ఓడిన వారిని ఎద్దేవా చేస్తూ త్రిపుర దహన వాలకం కట్టారని చెప్పవచ్చునంటారు.
ఉదాహరంణగా కూచిపూడి భాగవతులు వీర నరసింహరాయల కొలువులో సిద్ధవటం సామంతుడు సంబెట గురవరాజు దురంతాలను కళ్ళకు కట్టినట్లు ప్రదర్శించి ఆ ప్రజా కంటకుని తొలగించిన ప్రదర్శనం వాలకం లాంటిదే.
సమాజానికి సంబంధించిన సాంఘిక కట్టు బాట్లనూ, గ్రామ జీవితాన్ని ఖాతరు చేయని ప్రజా కంటకుల్నీ అమ్మవారి ముందూ, ప్రజల ముందూ వారి గుట్టు మట్టుల్ని చీల్చి చెండాడుతారు వాలకం ప్రదర్శనంలో.
తాటాకులు కట్టటం లాంటి మాటలను బట్టి ఒక నాడు వాలకం, తెలుగు నాట నాలుగు చెరగులా ప్రదర్శింపబడి వుండవచ్చు. ఈనాడు ఈ వాలకం ఒక్క విశాఖ జిల్లాలో అందునా, ఎక్కడో మారు మూల గ్రామాల్లో నామమాత్రావిశిష్టంగా వుండి వుండవచ్చు.
అయితే ఈనాటి సామజిక, ఆర్థిక, రాజకీయ, అస్తవ్యవస్థ పరిస్తితుల్లో జానపద కళారూపమైన ఈ వాలకాన్ని పునరుద్ధరించడం ఎంతైనా అవసరం. ఉత్సాహ వంతులైన యువకులకు ముఖ్యంగా కళాశాల విద్యార్థులకు ఎంతో అనుకూలంగా వుంటుంది. అందుకు ఉదాహరణ, బాదల్ సర్కారు వ్రాసిన నాటకం, విశాఖ పట్టణం కళాజ్యోత్స్న వారు ప్రదర్శించే ఊరేగింపు నాటిక వాలకం లాంటిదే.
ఆశువుగా ప్రదర్శించే ఈ కళారూపం అవధానాలు ఎంతటి ప్రజారంజకంగా వుంటాయో, ఈ వాలకాలు కూడా అంతటి ప్రజారంజకాలుగా వుంటాయి.