పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/587

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుపతి వెళ్ళి వచ్చిన వారు దీపారాధన రోజున రాత్రి పూట ఈ కథను ప్రదర్శిస్తారు. ఈ ప్రదర్శనానికి కొబ్బరాకుల పందిరిని ఏర్పాటు చేస్తారు. కథకులు ఇద్దరుంటారు. నుదురు మీదా, భుజాల మీదా, రొమ్ము మీదా, చేతుల మీదా, పెద్ద పెద్ద నామాలను ధరించి, నూనె గుడ్డలు చుట్టబడిన రెండు కోలలను వెలిగించి, రెండు కోలలనూ త్రిప్పుతూ, ఓరోరి వెంకన్న, ఓరి వెంకన్న అని పాడుతూ వుంటే వీరికి వంతలుగా పెద్ద ధ్వని నిచ్చే పెద్ద తాళాలను వాయిస్తూ వంత పాట పాడుతూ వుంటే, ఒక వ్వక్తి వీరి మధ్యలో ఒకరు ఒక చేతిలో పేము బెత్తాన్ని, రెండవ చేతిలో నెమలి ఈకల కట్ట పట్టుకుని, రంగస్థలంలో, వెనక్కూ ముందుకూ నడుస్తూ, అంగ విన్యాసం చేస్తూ... జన రంజకంగా కథను సాగిస్తారు. రంగస్థలంలో మామూలు లైట్లున్నా, వెలిగించిన కోలల కాంతి కూడా మంచి వెలుగురు నిస్తుంది. చెప్పే కథ తిరుపతి వెంకన్నకు సంబంధించిన కథ. ఇది మామూలుగా పురాణాల్లో వున్న వెంకటేశ్వరుకి కథ కాదు. అలిమేలు మంగమ్మ, బీబీ నాంచారమ్మ, వెంకన్న బాబుల ప్రణయానికి సంబంధించింది. విరహంతో కూడిన భిన్నమైన జానపద కథ అని పడాల రామ కృష్ణారెడ్డి గారు ఉదహరించారు. తెలుగు ప్రజలు ఇదే నిజమైన కథ అని నమ్మి ఎంతో ఆసక్తితో విని ముగ్ధులౌతారు. ఈ కథను కేవలం కథగానే చెప్పటం కాక, మధ్య మధ్యలో సునిశిత మైన హాస్యాన్ని ప్రవేశ పెడతారు. కోలను త్రిప్పే అతను మధ్య మధ్య కథను ఆపి విచిత్రమైన ప్రశ్నలు వేసి వాటికి తగిన సమాధానలను రెండవ వానితో చెప్పిస్తాడు. ఈ ప్రశ్నలు సమాజ జీవితానికి సంబంధించి వుంటాయి. ఇవి ఒక ప్రక్క నవ్వులతో ప్రేక్షకులను రంజింప చేయడంతో పాటు విజ్ఞాన పరుస్తూ సామాజిక బాధ్యతలను తెలియ చేస్తాయి. దానితో పాటు భక్తి తత్వాన్ని ప్రబోదిస్తూ వుంటాయి. ఈ కోల సంబరం కథలు ఉభయ గోదావరి జిల్లాలలో ఎక్కువగా ప్రదర్శిస్తారు.

మానాటి గొల్లల కథ:

కోల సంబరం అనే జానపద కథా రూపం ప్రాచీనమైనది. ఇది మానాటి గొల్లలచే ప్రారంభించ బడింది. ఆ కులంలో జన్మించిన గొల్ల అచ్చమ్మ అనే స్త్రీ ఈ కథను గానం చేసేది. తూర్పు గోదావరి జిల్లా పెనికేరు దగ్గరలో వున్న కీలక చర్ల ఈమె స్వగ్రామం.