వారు లయ ప్రకారం రెండు భాగాలుగా నిలబడిన కేంద్రం నుంచి మరో కేంద్రానికి ఒకరి తరువాత మరొకరు వరుస క్రమంలో తిరగడంతో ఈ త్రాళ్ళన్నీ అల్లబడిన జడలాగా ఎంతో సుందరంగా కనబడుతుంది.
ఇలా జడను అల్లడం ప్రారంభించి, జడ పూర్తి అయ్యే వరకూ పాట పాడుతూ అల్లుతూనే వుంటారు. ఈ అల్లికలో ఒక్కరు తప్పుగా నడిచినా జడ చిక్కై పోతుంది. అందు వల్ల ప్రతి ఒక్కరూ వరుస తప్పకుండా నిపుణతతో జడను అల్లుతారు.
ప్రారంభంలో ఈ జడను అల్లడం నిదానంగా సాగుతుంది. తరువాత అతి వేగంగా అల్లబడుతుంది. ఈ వేగంలో కోలాట నృత్యం ప్రేక్షకులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇలా జడ కోపు పూర్తి అయిన తరువాత
అందరూ ఒక పుష్పాకారంలో దగ్గరకు చేరుకుంటారు. ఆ తరువాత జడను ఎలా అల్లుతారో అలాగా మరలా ఎదురు తిరిగి జడను విడదీస్తారు. జడను అల్లినంత కష్టం వూడదీయటంలో వుండదు. విడదీయటం అతివేగంగా జరుగుతుంది. ఈ విధానం ఎంతో కనుల పండువుగా వుంటుంది.
- జడకోపులో బాలికలు:
ముఖ్యంగా జడకోపు కోలాటం బాలికలు వేయడం ఎంతో ఆనందంగా వుంటుంది. బాలికల్లో ఒకే ఎత్తు కలిగిన వారిని కోలాటానికి ఎంచు కుంటారు. అందరూ వాలు జడలు వేసి రంగు రంగుల పూలు ధరిస్తారు. ఒకే రంగుగల లంగాలు, చొక్కాలు తొడుగుతారు. రంగు రంగుల కోలాటపు చిరుతలు ధరించి వలయాకారంగా తిరుగుతూ వుంటే ఇంద్ర లోకంలో దేవతలు నృత్యం చేస్తున్నారా అనిపిస్తుంది.
గొంతులు కలిసిన ఇద్దరు బాలికలు పాట ప్రారంభిస్తే దళంలోని బాలికలందరూ ఒక్కసారిగా, గుమ్ముగా అందుకుంటారు. ఇలా పాడే బృందగానం, చెవుల కెంతో ఇంపుగా వుంటుంది. వీరి జడకోపు ప్రదర్శనం శాస్త్ర యుక్తమైన భరతనాట్యంలో ఒక భాగంగా కనిపిస్తుంది. ఈ కోలాట నృత్యాన్ని ఒక వ్వాయామ క్రీడగా, ప్రతి సాయంత్రమూ డ్రిల్లు క్లాసులో వేయిస్తూ వుండేవారు. బాలికల కోలాటంలో ఆ రోజుల్లో ఇలా పాట పాడుతూ వుండేవారు.