Jump to content

పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/512

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సిరిసిరి మువ్వల చిరుతల రామాయణం

చిరుతల రామాయణం తెలంగాణా ప్రాంతంలో చాల వ్వాప్తిలో వుంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లాలో చిరుతల రామాయణం అతి ప్రాచీన కళారూపం. పల్లెల్లోని శ్రామిక యువకులు ముప్పై నలబై మంది కలిసి వేసవి కాలంలో ఒక గురువును నియమించుకుని చిరుతల రామాయణాన్ని నేర్చుకుంటారు.

ఊరు బయట విశాలమైన స్థలంలో ఒక కర్ర పాతి, దానికి జండాలు కట్టి, చిరుతలు పట్టుకుని, కాళ్ళకు గజ్జెలు కట్టుకుని పాట పాడుతూ నృత్యం చేస్తారు. న్యాయానికి ఇది మన కోలాటం లాంటిదే అయితే వీరు ముఖ్యంగా కోలాటం పాటలు కంటే చిరుతలతో నృత్యం చేస్తూ రామాయణ భారత కథలను తీసుకుని బృంద సభ్యులే పాత్రలుగా వ్వవహరించటం వల్ల దీనికి చిరుతల రామాయణమని పేరు వచ్చింది.

పాత్రల ఎంపిక:

ప్రథమంలో బృంద సభ్యుల అకారాల ననుసరించి, పాత్రలను ఎంపిక చేస్తారు. తరువాత వేషధారణ లేకుండానే ప్రతి పాత్రకూ పాటను నేర్పుతాడు. ప్రతి పాత్రధారికీ క్షుణ్ణంగా పాట వచ్చి తీరాలి. ఈ విధంగా ఒక మాసం రోజులు గురువు బృంద సభ్యులతో రామాయణం శిక్షణ ఇస్తాడు. అభ్యాసం అయిన తరువాత రామ పట్టాభిషేకం వుంటుంది. ముఖ్యంగా సీతారామ పాత్రలు ధరించేవారు. ధనవంతుల ఇళ్ళలో చీరలు, పంచెలు, నగలు సంపాదించి వేషధారణను సమకూర్చుకుంటారు.