పుట:TeluguVariJanapadaKalarupalu.djvu/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మరో గాథ కూడ ఇలా తెలుస్తూవుంది. ఒక గృహస్థు సంతానార్థియై ఏడుగురి అక్కల్నీ ఆరాధించి నట్లూ, ఆ సందర్భంలో ఏడుగురు అక్కలూ లేచి నృత్యం చేశారనీ, ఆ అక్కలే యక్షకన్యలనీ చెప్పబడింది.

యక్ష శబ్ధం జక్క - ఎక్క అనే రూపాంతరాలే కాక, అక్క అనే రూప వికృతి కూడ అంగీకరించ తగిందే అని గంటి సోమయాజి గారన్నారు.

నాట్యంలో దేసి మార్గ నృత్యాలను గురించి శ్రీనాథుడు కాశీ ఖండంలో ఉదహరించాడు. జిక్కిణి చిందు అనీ, అది దేశీయ నృత్యమనీ దశావతార చరిత్రలో ఈ క్రింది విధంగా వర్ణించాడు.

దురుపదంబులు సొక్కు మైసిరుల నొసగ
సరిగె నిరుగెల కుంచియల్ నవదరించి
పెక్కువగ జిక్కినీ కోపు ద్రొక్కె
చక్కని మిఠారి నరపతుల్ సొక్కి చూడ

అనడాన్ని బట్టి, జిక్కిణి దరువు, జిక్కిణి కోపు చాల ప్రాచీనమైనవిగా ఎంచవచ్చు.

యక్షుల జిక్కిణి:

నృత్యగానలలో ప్రజ్ఞావంతులైన యక్షులు, సింహళం వదిలి దక్షిణ భారత దేశానికి వలస వచ్చిన జక్కుల జాతి వారనీ, ఇది పలువురి అభిప్రాయమనీ కీ॥శే॥ శ్రీనివాస చక్రవర్తి గారు వివరించారు.

సింహళంలో వాడుక భాష పాళీ భాష సంస్కృత యక్ష శబ్దానికి ప్రాకృతం, ఎక్కులు తెలుగు తద్భవం జక్కులు. జక్కులవారు వలస వచ్చిన వారైనా, ఆదిమ వాసులైనా, వారు సంగీత నృత్య కళాకారు లన్నమాట తద్యం. వీరి పేరనే జిక్కిణి రేకులు, జిక్కిణి నృత్యం వెలిశాయి. ఇందుకు ఉదాహరణ: "భామ వేష కథ" అనే యక్షగానంలో__

జోగక గీత వాద్యముల సొంపుగ నింపుగ
పంచ జక్కిని ప్రాగటమైన నాట్య
రసభావముల విన్పింతు వేడుకన్___ అని