పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/403

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

348

తాలాంకనందినీపరిణయము


వ్వరియెడ గల్గగా నతఁ డవార్యపరాక్రముఁ డౌచు నెట్టిదు
స్తరమదవైరినైన బలదర్ప మడంచి వధించు టబ్రమే!

87


ఉ.

పాండుసుతు ల్భవచ్చరణపద్మములే నెఱనమ్మి గాదె స
త్పాండురకీర్తిసంపదల భాసిలి రట్లభిమన్యశౌరికిం
బెండి లొనర్చఁగా భవదభిప్రియమైనను నేనొకండ రా
కుండిన నేగొఱంత యగునో! మధుసూదన వైరిభేదనా!

88


గీ.

అనుట యభిమన్యుఁ డన్నరాఁ డనుట దెలిసి
విన్ననై యున్న యాసన్న వెన్నుఁ డెఱిఁగి
దనుజునికరమ్ము తనకరమ్మునను బట్టి
బలికె నిట్లని కపురంపుఁబలుకు లొలుక.

89


మ.

తనకల్యాణము కీవు రావనెడి చింత న్సోదరుం డున్నవాఁ
డెనయ న్నీవిటు దల్ప తమ్మునకు ప ట్టెవ్వండగుం దండ్రు ల
వ్వనిలో నుండఁగ నీవొకండ వనుకంపన్ వచ్చితే వారలె
ల్లను విచ్చేసినరీతి మామదిని నుల్లాసంబు సంధిల్లెడిన్.

90


క.

అడుగో చూడుమి నీత
మ్ముఁడు నీవటరానిభావము గని మదిలో
నడలుచును మౌనమున ధృతి
జెడి చింతిలు వాని కేమి జెప్పెదు హితవుల్.

91


చ.

అనిన సురద్విషాగ్రణి నిజానుజుఁ డున్నతెఱం గేఱింగి యి
ట్లనే నభిమన్య నే నురకనాడితిగాని భవద్వియోగముం
క్షణము సహింతునే జనకసంతతి నీకడలేనివేళ వే
రణమున కేనురాక మదిరంజిల నిచ్చట నుండనేర్తునే!

92


క.

జనకులగు ధర్మముఖ్యులు
గనకుండుట మన యభాగ్యకర్మంబున కే
మననచ్చు ననుచు నాలిం
గన మొనరింపుచును బ్రమోదకలితుం జేయన్.

93