పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70 తాలాంకనందినీపరిణయము


గీ.

పెక్కువగఁజిక్కు నటకు లొక్కొక్కదిక్కు
నుట్టిపడినట్టి మాగధు లొక్కతట్టుఁ
గొలువ కొలువున కొలువుండె నలువచెలువు
మయునిమాయామయాలయమధ్యమునను.

300


చ.

అపు డతిమత్తుఁడుం దురభియాతి దయారసవర్జితుం డస
త్యపథుఁ డహంకృతుండు కలుషాత్మకుఁడుం గులపాంసనుండు బం
ధుపటలవైరి యార్యజనదూషకుఁ డైన సుయోధనుండు త
ద్విపులసభాంతరస్థలికి వే జనుదెంచె నుదంచితప్రభన్.

301


సీ.

అతిచిత్రగతిమిత్రతతి వేత్రములఁ బూని
    బలశీలులై వెంటబలసి గొలువ
సకలాభినయశోభితకళాభిరతులచేఁ
     బ్రమదాలినర్తన ప్రమద మెసఁగ
మణికంకణాలంకరణఝంకరణము తో
     రములుగా సితచామరములు వీవ
నసమానలసమానరసగాన మెనసి హృ
     ద్యములుగా నిఖిలవాద్యములు సెలఁగ


తే.

హితపురోహితసుత సుహృత్ప్రతతివినుత
సతతహితగతి నతికుతుకత దనర్ప
వచ్చె నచటికి నతిమదమచ్చరమున
గ్రోధమానధనుండు దుర్యోధనుండు.

302


మ.

చనుదేరం గపటాత్ముఁడౌ కతన నాస్థానంబు మాయావిమో
హనముం గావున నిర్జలస్థలి ప్రవాహప్రాయమై నీరము
లనుబట్టం దన చింగులెత్తుకొని డాకాలూఁతచేతం జివు
క్కున లంఘించు జలంబుగల్గునెడలం గూర్చుండు భావభ్రమన్.

303