పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

స్వీయ చరిత్రము.

చూపుటయు వారినిజూచి విసుగుకొనుటయు నెంత మంచివారిలోనైనఁగొంత వఱకు సహజముగా నుండును. నా పెద్దతల్లి యిట్టియసహనచిహ్నముల నేమాత్రము కనఁబఱిచినను నాతల్లి యోర్చుకొని యూరకుండునది కాకుండెను. తనకుమారుఁడు పెద్దవాఁడయి విద్యాబుద్ధులఁ బడసి సంపాదించి పెట్ట శక్తుడగువఱకును కష్టముల కోర్చుకొని యడఁగి యుండి నెమ్మదిగా కాలము గడపుకోవలె నన్న దూరాలోచనయు శాంతస్వభావమును లేనిదయి మత్సరమే ప్రధానముగాఁగైకొని నాతల్లి యితరులు తన్నొక్కమాట యన్న తోడనే తా నితరులను పదిమాటలని కలహమును బెంచుచు స్వతంత్రప్రకృతిని జూపునదిగా నుండెను. నాతల్లి కోపస్వభావమును స్వతంత్రబుద్ధియు వాక్పారుష్యమును గలదయినను, దయార్ద్రహృదయమును పరోపకారచింతయు సత్యశీలతయు ధైర్యశాలిత్వమును పూనిన కార్యమునందలి స్థిరపృవృత్తియి నామె కలంకారములుగా నుండెను. అందుచేత నామె దీర్ఘక్రోథము కలదిగాక యొకవేళ నెవ్వరిమీఁద నైనను దురాగ్రహపడి తిట్టినను, అచిరకాలములో నే యా కోపమును మఱచి వారిని పలుకరించి వారితో మరల మంచిమాట లాడుచుండును; తనకు విరోధులుగా నుండినవారికైనను కష్టము వచ్చినయెడల పిలువకయే పోయి తోడుపడుచుండెను; తనకడుపు కట్టుకొనియైనను తనకున్న దానిలోనే యన్నా తురులయి వచ్చిన బీదలకుఁ బెట్టుచుండెను. తల్లిగుణములు బిడ్డలకు వచ్చునని పెద్దలు చెప్పినమాట యసత్యము కాదుగదా. ఆమె గుణములలోఁ గొన్ని నాకును బట్టుపడినవి. ప్రకృతిచేత నేనును కోపస్వభావము గలవాఁడనే; సాధారణముగా నేనెంత శాంతచిత్తుఁడను గాఁ గానఁబడినను నాకు కోప మతిశీఘ్రముగా వచ్చును; ఒరులు చెడుపని చేసినప్పుడు నాకు కోప మాగదు; నే నప్పుడు పరుషభాషణములు సహితము పలుకుదును. నే నెన్నియో సారులు పశ్చాత్తాపపడి యీదుర్గుణమును మాన్పుమని యీశ్వరుని ప్రార్థించినను మానవలెనని ప్రయత్నించినను నన్నీ యవగుణముల నేటికిని విడిచిపెట్టకున్నది. వయస్సెంత వచ్చినను బుద్ధి యెంత హెచ్చినను స్వభావము మాఱదు