పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/263

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

249



ఱలేదనియు, వివాహముచేసికొనుటకు సంసిద్ధులయియున్న మఱియొక వధూవరులకు ధనసాహాయ్యము కావలసియున్న దనియు, ఆయన వ్రాసెను. అందుమీఁదట మచిలీపట్టణములో నొకటిరెండు వివాహములు జరగు సూచనలు కానఁబడుచున్నవనియు, అక్కడివారు నన్నాహ్వానముచేసిరనియు, నేనచ్చటికి వెళ్లవలసినదని మీయభిప్రాయమేమో తెలుపవలసినదనియు, ఆలోచన యడుగుచు నేను పైడా రామకృష్ణయ్యగారికి వ్రాసితిని. ఆయన నా లేఖకు ప్రత్యుత్తరముగా 1884 వ సం|| మే నెల 20 వ తేదిని కాకినాడనుండి నా లిట్లు వ్రాసిరి.

"కాకినాడ, 20-5-84.

నాప్రియమిత్రుఁడా !

ఆరొగ్యము నిమిత్తము మీరు వెళ్లియుండిన నరసాపురమునుండి వ్రాయఁబడిన మీయుత్తరము నందుకొంటిని. మీరు కొంతమేలుగా నున్నారని నమ్ముచున్నాను. ఒకటి రెండు వివాహములనిమిత్తము మీరు కోరఁబడి నందున మీరు మశూలాకు వెళ్లవచ్చు నేమో యాలోచన చెప్పవలసినదని మీరు నన్నడిగియున్నారు. అక్కడ పక్షవిద్వేషము విస్తారముగా నున్నందును అక్కడి పరార్థపరురులు కష్టములపాలు చేయఁ బడుదు రని భయపడుచున్నాను. సొమ్ముతో సహితము తగినంత సాయము చేయువారు మీకక్కడ నెవ్వరునులేరు. ఇటువంటి స్థితులనుబట్టి మీయారోగ్యము వచ్చుట కనుకూలముగా లేదని మీరు వారికి వ్రాసి తెలుపవలెను. వారు తమకు చేతనైనది శక్తికొలఁదిని తామే చేసికొందురు. వేఁడి భయంకరముగానుండి నాకు చెఱుపుచేయుచున్నది. నేను నిర్వేదపడుచున్నట్టున్నాను. కడచిన రెండుమూడు దినములనుండి యది 110 డిగ్రీలున్నది. కాఁబట్టి యేమి చేయవలసినది మీరెఱుఁగుదురు. నామట్టుకు నేను మీయారోగ్యమునుబట్టి మీరు వెళ్లవలసినది.