పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

స్వీయ చరిత్రము.



సినదనియు, అప్పటికి వివాహములయ్యెడు చిహ్నములు కనఁబడకపోయిన యెడల ప్రాయశ్చిత్తము చేయించుకో వచ్చుననియు, నేను చెప్పితిని. మోమోటముచేత నాముందు ప్రాయశ్చిత్తమును నిలుపుచేసెదనని పలికి నన్ను వీడ్కొని వెడలిపోయెను. అటుతరువాత గంటసేపటికి కొందఱు విద్యార్థులు నావద్దకువచ్చి రామకృష్ణయ్యగారు ప్రాయశ్చిత్తము చేయించుకొనఁ బోవుచున్నారని చెప్పిరి. నేను వెంటనే వారియింటికిఁబోయితిని. నేను పోవునప్పటికి ప్రాయశ్చిత్తమునకై యేర్పాటుచేసిన మాప్రతిపక్షనాయకులును కొందఱు వైదికులును రామకృష్ణయ్యగారిని పరివేష్టించియుండిరి. రామకృష్ణయ్యగారానాయకులతో మాటాడిపంపివేసి, నేను మాయింటికి వచ్చిన తరువాత గోదావరిమీఁద పడవయెక్కిపోయి బొబ్బర్లంకలో ప్రాయశ్చిత్తము చేసికొని వచ్చి నాఁడే కాకినాడకు వెడలిపోయిరి. ప్రాయశ్చిత్తము చేసికొన్న తరువాత రామకృష్ణయ్యగారు మాసవ్యయముల నిమిత్తము సొమ్ము పంప మానివేసిరి. నేనీసంగతి నెవ్వరికిని దెలియనీయక వారు సొమ్ము పంపుచుండి నప్పటివలెనే యధాపూర్వముగా సేవకులజీతములు మొదలైనవిచ్చుచు పనులు జరుపుచుంటిని.

ఇప్పుడు కేష్ణస్వామిరావు పంతులుగారి యుత్తరములో సూచింపఁబడిన గోగులపాటి శ్రీరాములుగారి వృత్తాంతమునకు వత్తము.ఆయన వివాహచేసికొని మరల విశాఘపట్టణమునకు వెళ్లిన యల్పకాలములోనే యాయనకు రక్తగ్రహిణి పట్టుకొని యంతకంతకు హెచ్చయ్యెను. జనేవరునెల మూడవవారములో నతఁడు ప్రాణసంశయదశలో నున్నూఁడని మిత్రులు నా కుత్తరములువ్రాసి తంత్రీవార్తను బంపిరి. ఆసమయములోనే మాలో చేరియున్న దర్భా వేంకటశాస్త్రిగారక్కడలేక సెలవుమీఁద స్వస్థలమయిన బందరు (Masulipatnam)నకు వెళ్లుట తటస్థించెను. అప్పుడు నాకు కలిగిన మనోవ్యాకులతకు పరిమితిలేదు. వివాహమైన నెలదినములలోనే మొదట వివాహముచేసికొన్న పురుషునకేమైన తటస్థించినపక్షమున జనులు దాని