పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

స్వీయ చరిత్రము.


మొదటి వివాహమయిన నాలవదినమున పండ్రెండేండ్ల ప్రాయముగల యొక బాలవితంతువును వెంటఁబెట్టుకొనివచ్చి యామెతల్లి తనభర్త యాచిన్న దానిని వివాహమునిమిత్తము మాయొద్దకుఁబంపెననిచెప్పెను. మేమామెమాటలు నమ్మి భోజనముచేసి సకలకలాశాలా ప్రవేశపరీక్షనిమిత్తమయి పరీక్షాస్థలమునకు పోఁబోవుచున్న యొకవిద్యార్థిని తత్క్షణమేరప్పించి వధువునుజూపి యాతఁడొప్పుకొన్న మీఁదట వివాహము సిద్ధముచేసితిమి. పెండ్లికొమారుఁడు మంగళస్నానమునకుఁ గూరుచుండు వఱకును మాపురజను లీ వివాహము జరుగనన్న సంగతియే యెవ్వరునెఱుఁగరు. ప్రతిపక్షులవారు లతఁడు మంగళస్నానమునకుఁ గూరుచుండఁగా చూచి పరుగెత్తుకొనిపోయి పిడుగువంటి యీవార్త నతనితండ్రితోఁజెప్పిరి. అతఁడును రోదనముచేయుచు పెద్దపెట్టున కేకలువేయుచు వివాహసమయమున వధూవరులు పెండ్లి పీటలమీఁద కూరుచుండి యున్నప్పుడు పరుగెత్తుకొనివచ్చి పెండ్లికుమారుని లేవఁదీసి లాగుకొనిపోవుట కయి ప్రయత్నించెను. కాని, మాలోనివారు కొందఱాయనను కౌఁగిటఁ బట్టుకొని యొకగదిలోనికి తీసికొనిపోయి కూరుచుండఁబెట్టి శతమానము ముడిపడువఱకును మంచిమాటలుచెప్పియోదార్చుచు సమాధానపఱిచి తరువాత మెల్లఁగా నావలకు పంపివేసిరి. ఆమఱునాటిరాత్రి యీయిద్దఱు పెండ్లి దంపతులను మహావైభవముతో పెండ్లిపల్లకులలో నూరేగించితిమి. ఆరాత్రిజరిగిన యూరేగింపు మహోత్సవవైభవము సంస్థానాధిపతుల వివాహముల యందుకూడ జరిగి యుండదు. అఱువదిమంది పోలీసుభటులతో పోలీసు స్యూపరింటెండెంటే పల్లకులను జనుల యెత్తుడునుండి సంరక్షించుచు పురవీధులలో వెంటనడిచెను. హిందువులలోని తగుమనుష్యులు మాత్రమేకాక మండలన్యాయాధిపతి (District Judge) సంయుక్తదండ విధాయకుఁడు (Joint magistrate) శాస్త్రపాఠశాలాప్రధానోపాధ్యాయుఁడు (College principal) మొదలయిన యూరపియనులు సహితము మహోత్సాహముతో పల్లకులవెంట నడిచిరి. వేలకొలఁదిజను లావేడుకను చూడవచ్చుటచేత వీధు లొకకొననుండి