పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాగరికుల కంతగా రుచింపని నా స్వీయచరిత్రమును రెండవసారి ముద్రింపవలసిన యావశ్యకముండునోలేదో చదువరుల యాదరణమునుబట్టి ముందు చూడవలసియున్నది.

తెలుఁగుభాషలో స్వీయచరిత్రమును వ్రాయఁబూనుకొనుటకిదియే ప్రథమ ప్రయత్నము. ఇట్టి స్వచరిత్రమును వ్రాయుటలో నితరగ్రంథరచనములోనున్న వానికంటె నెక్కువకష్టములు కానవచ్చు చున్నవి. తన్నుఁగూర్చి తాను వ్రాసికొను నప్పుడీశ్వర ముఖమునుజూచి సత్యమునే చెప్పఁబూనినను సమకాలపువారది యాత్మస్తుతి గానో పరనింద గానో చేకొని యన్యధా భావింపవచ్చును. ఒకానొకప్పుడు పరులనుగూర్చి యప్రియములగు సత్యములను బయలుపఱుపవలసివచ్చినప్పుడు వారికిని వారిమిత్రులకును బంధువులకును మనస్తాపము కలుగవచ్చును. అయినను సాధ్యమైనంత వఱకన్యుల మనస్సులకు నొప్పి కలిగించెడు విషయముల ననావశ్యకముగా నిందుఁ జొప్పింపమానితిని గాని కొందఱినిగూర్చి మనస్సున కింపుగాని విషయములనని వార్యముగా వ్రాయవలసివచ్చి నందున కెంతయు చింతిల్లుచున్నాఁడను. సహృదయులు నా యెడల సదయ హృదయులయి యిందుపొడకట్టు భ్రమప్రమాదజనిత దోషములను సుహృద్భావముతో నుపేక్షించి నన్ను మన్నింతురుగాక!

కందుకూరి - వీరేశలింగము.

రాజమహేంద్రవరము.

15 - వ డిసెంబరు 1910.