పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇన్‌స్పెక్టర్) వద్దకు కొడుకును, చదువు కోసం విజయనగరం పంపాడు.

రామమూర్తి నాయుడు, జాతీయోద్యమ నాయకుడు ద్వార బంధాల చంద్రయ్య నాయుడుగారి పట్ల ఆకర్షితుడైనాడు. చంద్రయ్య కోయ యువకుల దండును నెలకొల్పి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం సాగించాడు. చంద్రయ్యను పట్టి యిచ్చిన వారికి వేలాది రూపాయల బహుమతి ప్రకటించింది ప్రభుత్వం.

బాల రామమూర్తి నాయుడు చదువుల పట్ల శ్రద్ధ చూపకపోయాడు. తండ్రికి కోపం వచ్చి బాగా వాయించాడు. రామమూర్తి ఇల్లు వదలి అడవులు చేరాడు. వారం రోజుల తర్వాత ఒక పులి పిల్లను పట్టుకొని, విజయనగరం వీధుల్లో తిరుగుతున్న రామమూర్తి నాయుడును చూచి అందరూ ఆశ్చర్య చకితులయ్యారు. విజయనగరంలో ఉన్నపుడు తాలిమ్‌ఖానాలో చేరి, శరీర వ్యాయామం అభ్యసించాడు. కుస్తీ పట్లన్నీ నేర్చాడు.

ఇక లాభం లేదని, పినతండ్రి కోడి నారాయణస్వామి, రామమూర్తిని సైదాపేట (మద్రాసు) లోని వ్యాయామ శిక్షణ కళాశాలకు పంపాడు. ఏడాది శిక్షణ తర్వాత వ్యాయామోపాధ్యాయుడుగా సర్టిఫికేట్ అందుకుని, విజయనగరంలో తాను చదివిన హైస్కూలులో వ్యాయామ శిక్షకుడుగా చేరాడు.

విజయనగరంలో పొట్టి పంతులు అనే మిత్రుని సహకారంతో సర్కస్ కంపెనీ నెలకొల్పాడు. తుని రాజాగారి నుండి సంపూర్ణ సహకారం లభించింది. రామమూర్తి సర్కస్ సంస్థ పలుచోట్ల ప్రదర్శనలిచ్చి మంచిపేరు తెచ్చుకున్నది. తెలుగు జిల్లాల్లో ప్రదర్శనల తర్వాత 1912లో మద్రాసు చేరాడు. పులులు, ఏనుగులు, గుర్రాలు, చైనా, జపాన్ కళాకారుల సహకారం ఆయనకు లభించాయి.

రామమూర్తి ప్రదర్శనలు అందరినీ ఆకర్షించాయి. శరీరమునకు కట్టిన ఉక్కు గొలుసును, ఊపిరితిత్తులలో గాలిని పూరించుకుని ముక్కలుగా తుంచి వేశాడు. రెండు కార్లను రెండు భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకునేవాడు. కార్లను శరవేగంగా నడపమనేవాడు. కార్లు కదలకుండా పోయేవి. రొమ్ముపై పెద్ద ఏనుగును ఎక్కించుకునేవాడు. 5 నిమిషాల పాటు, రొమ్ముపై ఏనుగును అలాగే ఉంచుకునేవాడు. తండోపతండాలుగా ప్రజలు వారి ప్రదర్శనలు చూచేవారు.

పూనాలో లోకమాన్య తిలక్ గారి కోరిక మేరకు ప్రదర్శనలిచ్చాడు. తిలక్ రామమూర్తిగారికి 'మల్లమార్తాండ', 'మల్లరాజ తిలక్' బిరుదములిచ్చారు. విదేశాలలో భారత ప్రతిభను ప్రదర్శించమని ప్రోత్సహించాడు తిలక్.

హైదరాబాద్ లో ఆంధ్రభాషా నిలయం పెద్దలు ఘనసత్కారం చేసి 'జగదేకవీర' బిరుదమిచ్చారు.

అప్పటి వైస్రాయి లార్డ్ మింటో, రామమూర్తిగారి ప్రదర్శనలను చూడాలని వచ్చాడు. రామమూర్తి అప్పట్లో ఆంజనేయ ఉపాసనలో వుండినందున పది నిమిషాలు వేచాడు. రామమూర్తి ప్రదర్శనలను చూచి ముగ్ధుడయ్యాడు. తానే పరీక్షించాలనుకుని