పుట:SuprasiddulaJeevithaVisheshalu.djvu/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కత్వంలో వేలాదిమంది చెరువు నీరు స్వీకరించారు. ఈ సంఘటన మహారాష్ట్రంలో సంచలనం కలిగించింది.

1927లో అంబేద్కర్ 'బహిష్కృత భారతి' అనే మరాఠి పక్ష పత్రిక ప్రారంభించాడు. ఆ పత్రికలో ఒక వ్యాసం వ్రాస్తూ అంబేద్కర్ ఇలా అన్నాడు: తిలక్ గనుక అంటరానివాడుగ పుట్టివుంటే 'స్వరాజ్యం నా జన్మ హక్కు'అని ఉండడు. ' అస్పృశ్యతా నివారణే నా ధ్యేయం, నా జన్మ హక్కు' అని ప్రకటించి ఉండేవాడని వ్రాశాడు. అంటే ఆనాడు అంబేద్కర్ కులతత్వవాదుల బాధను ఎంతగా అనుభవించాడో తెలుస్తుంది.

1927లో ఛత్రపతి శివాజీ త్రిశతి జయంతి ఉత్సవాలు మహారాష్ట్ర అంతటా గొప్పగా జరిగాయి. అంబేద్కర్ ను సాదరంగా ఆహ్వానించాడు కొలాబాలోని ఉత్సవ సంఘాధ్యక్షుడైన బ్రాహ్మణుడైన పలాయ శాస్త్రి. ఆ ఉత్సవాలలో ప్రసంగిస్తూ అంబేద్కర్ పీష్వాల సామ్రాజ్య పతనానికి ముఖ్యకారణం అస్పృశ్యతను పాటించడమే అన్నాడు.

1927 డిసెంబర్ 25న అంబేద్కర్ 'మనుస్మృతి'ని బహిరంగంగా కాల్చటం మరో సంచలనం కల్గించింది. ఆ విషయంగా మాట్లాడుతూ సవర్ణ హిందువుల దృష్టిని బలవంతాన ఆకర్షించడానికి అపుడపుడు అలాంటి తీవ్ర చర్యలు అవసరమవుతాయన్నాడు. అంతేకాదు, మనుస్మృతి లోని అన్ని భాగాలు నిందనీయాలు కావు అన్నాడు.

1931లో రెండవ రౌండ్ టేబిల్ సమావేశ సన్నాహాల సందర్భంగా అంబేద్కర్ గాంధీజీని కలుసుకున్నాడు. "ఏ దేశంలో లేదా ఏ మతంలో తమను కుక్కలకన్నా, పిల్లులకన్నా హీనంగా చూస్తున్నారో అదేశాన్ని గురించి తానే విధంగాను భావించలేను అంటూ గాంధీజీ, 'ఐ హేవ్ నో హోమ్ ల్యాండ్'"అని చాటి చెప్పాడు. ఆ తర్వాత రౌండుటేబుల్ సమావేశాలకు లండన్ వెళ్లాడు.

1932లో బ్రిటీష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డును ప్రకటించింది. దాని ప్రకారం అస్పృశ్యులకు ప్రత్యేక స్థానాలు లభించాయి. ఎరవాడ జైలులో వున్న గాంధీజీ నిరాహారదీక్ష ప్రారంభించాడు. "మహాత్ములు వస్తుంటారు. పోతుంటారు. అంటరాని వారు మాత్రం అంటరాని వారుగానే వుంటున్నారు." అన్నాడు అంబేద్కర్.

కొన్ని సంవత్సరాలు అస్పృశ్యతా నివారణ కోసం దళిత జాతుల హక్కుల కోసం పోరాటం సాగించాడు. భారతదేశానికి స్వాతంత్ర్యం రావటం, రాజ్యాంగ పరిషత్తు సభ్యుడుగ అంబేద్కర్ విశేష శ్రమవహించి రాజ్యాంగం రచించటం ఆయన శేష జీవితంలో ప్రముఖమైన ఘట్టం.

టి.టి కృష్ణమాచారి (కేంద్రమంత్రి) ఒకమారు రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ 'రాజ్యాంగ రచనా సంఘంలో నియమింపబడిన ఏడుగురిలో ఒకరు రాజీనామా చేశారు. మరొకరు మరణించారు. వేరొకరు అమెరికాలో వుండి పోయారు. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాలలో నిమగ్నులయ్యారు. ఉన్న ఒక్కరిద్దరు ఢిల్లీకి దూరంగా ఉన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ రచనా భారమంతా డా.అంబేద్కర్ మోయవలసి వచ్చింది. రాజ్యాంగ రచన అత్యంత ప్రామాణికంగా వుంటుందనటంలో