పుట:Sukavi-Manoranjanamu.pdf/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
అప్పకవిగారు 'ఱెక్కలు', 'ఱేఁడు'లను ఱకారములందు వ్రాసినారు. 'రేకు' రేఫములందు వ్రాసినారు. (మరి) ఈ రెండు పద్యములందు నేమి పరిశీలించిరో తెలియదు. ఱెక్కలు, ఱేఁడు ఈ రెండు పదములు కూడా రేఫములందు వ్రాసితే బాగుండును. లేదా, రేకు పదము నుభయరేఫములందు వ్రాసినా బాగుగా నుండును. ఈ పద్యములు చూడలేదని తోచుచున్నది. చూచితే మరియొకరీతిని దిద్దుదురు.

15. ఆగమయతి

గీ.

అవని ట త ప వర్గముల నంత్యాక్షరములు
పరమునందున గల యూష్మవర్ణములకు
మొదలివర్ణంబు లాగమంబులయి నిలుచు
నాగమ విరామ మనఁగ రామార్థదేహ.

312
అర్థము :- ణ, న, మ- ఈ వర్ణములందుగల శ ష స హ లకు, ట త ప-ఈ వర్ణములు ఆగమముల(గును), ఆనగా మధ్యను వచ్చుననుట, ఆగమ మైనందున 'ఆగమయతి' అని పేరు. ఇందుకు కుమార వ్యాకరణ సూత్రము —

"అఘోషా దూష్మణః పరః ప్రథమోభినిధాన స్పర్శపరాత్తస్య స స్థానః"

ఈ సూత్రార్థము :- టకారము వచ్చుటకు. 'కృష్ణ' శబ్దమునందు షకారము ఊష్మము, ణకారము స్పర్శము. ణకారము ట వర్గములోనిదిగాన ప్రథమవర్ణము-టకారము-(ఆగమము) అగును. కృష్ట్ణుఁడు.

'ఏవం జిష్ట్ణు, రోచిష్ట్ణు, ధిష్ట్ణ్యాది.'

(తకారము వచ్చుటకు:- స్నాన శబ్దమునందు సకారము ఊష్మము, నకారము స్పర్శము. అది తవర్గములోనిది గాన ప్రథమవర్ణము-తకారము—వచ్చును. స్త్నానము.

'ఏవం స్త్నానాది.'

(పకారము వచ్చుటకు :-) భీష్మ శబ్దము నందు షకారము ఊష్మము. మకారము స్పర్శము. మకారము పవర్గములోదిగాన ప్రథమవర్ణము-పకారము-వచ్చును. భీష్ప్ముడు.