పుట:Sringara-Malhana-Charitra.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నీమోహనాకృతి నిరతంబుఁ జూడంగఁ
                   దవిలి నాకన్నులు తపము సేయు
నీవిలాసంబు నాయాత్మ నెలవు కొల్పి
తలఁపు లన్నియు నినుఁ గోరి తపము సేయుఁ
బ్రాణములకును బ్రాణమై పరగు నీవు
యువిద, నినుఁ బాసి యెబ్భంగి నోర్చువాఁడ.


సీ.

అంబుధి దావాగ్నికైన నోర్చును గాని
                   యోర్వలేదు నదీవియోగమునకు
నబ్జారి రాహువుకైన నోర్చును గాని
                   యోర్వఁడు తారావియోగమునకు
హరుఁడు హాలహలాగ్నికైన నోర్చును గాని
                   యోర్వఁడు గౌరీవియోగమునకు
నభ్రంబు పిడుగులకైన నోర్చును గాని
                   యోర్వలేదు తటిద్వియోగమునకు
నతనుఁ డీశ్వరునయనాగ్నికైన నోర్చుఁ
గాని యోర్వఁడు రతివియోగంబునకును
విశ్వభయదోగ్రనిర్వ్యగ్రవిరహవహ్ని
నువిద నినుఁ బాసి యేభంగి నోర్చువాఁడ.