ఇదేమి? కర్మబంధము నింత సులభముగ తప్పించుకొన వీలున్నదా యని సందేహపడనక్కరలేదు. చేసిన పాప కార్యమును గురించి, స్మరించుచు పాపపు తలపులను గురించి నిజమైన పశ్చాత్తాపము నొంది, మనస్సును త్రిప్పుకొన్న యెడల నదియు నొకకర్మమే యగును. దాని ఫలమును కూడ ఆత్మపొందును. కావున, భగవంతుని శరణుజొచ్చిన యెడల కర్మభారము తొలగిపోవుననుట కర్మవిధికి విరుద్ధము కాదు.
కాని తరువాత మంత్రములను చదివి ప్రాయశ్చిత్తము
చేసికొనవచ్చునని తలంచి పాపకార్యము చేసినయెడల
తప్పించుకొన వీలులేదు. నిజముగా మనస్సును త్రిప్పుకొనని
యెడల పాపము పోదు. కావలెనని చేసినవారి కిట్టి నిజమైన
పశ్చాత్తాపము రానేరదు. తాచేసిన పాపమునకు తగినంత
పశ్చాత్తాపపడిన నా పశ్చాత్తాపమే వానికి గొప్ప కష్టమును
దుఃఖమును తెచ్చి, ఇతరులు విధించు దండనకంటె నెక్కువ
దండన యగును. అట్టిక్లేశము ననుభవించిన, తన్ను తానే
శుద్ధిచేసికొనుట యగును. కాని, యెంతదూరము నిజముగ
క్లేశపడుదుమో, అనగా మనమే దుఃఖమునొంది దండించు
కొందుమో, అంతమట్టుకు మున్నుచేసినపాపమునుండి
తప్పుకొందుము.