అనుబంధము 3.
గీత: ధర్మభాండారము.
(పండిత మదనమోహన మాలవ్యా)
మానవచరిత్రలో నెల్ల నతిగంభీరమును, శ్రేష్ఠమును
నైన జ్ఞానమును మానుషశక్తియు గల యుత్తమ వ్యక్తి శ్రీ
కృష్ణుడని నానమ్మకము. ప్రపంచమందలి జీవద్భాష లన్నిటిలోను
సత్యజ్ఞానసంపూర్ణమై యుండియు నంత సంగ్రహమైన
గ్రంథము మరియొకటిలేదని నావిశ్వాసము.
పదునెనిమిది చిన్నయధ్యాయములుమాత్రముగల ఈ
అద్భుతగ్రంథములో వేదములయునుపనిషత్తులయు సారమంతయు
నిమిడియున్నది. ఇహపరములందు సంపూర్ణానందమును
పడయుట కది సూటియైనమార్గమును చూపుచున్నది.
ఉత్తమజ్ఞానమునకును, అకల్మషభక్తికిని, జ్యోతిర్మయమైన
కర్మమునకును దారిచూపు జ్ఞాన, భక్తి, కర్మయోగముల నది
బోధించుచున్నది. ఆత్మనిగ్రహము, త్రివిధతపస్సు, అహింస,
సత్యము, దయ, నిష్కామకర్మనిరతి, అధర్మము నెదుర్కొనుట,
అను విషయముల నది యుపదేశించు చున్నది.
జ్ఞానము, సత్యము, నీతిబోధనలతో నిండుకొనియుండి
అజ్ఞానదుఃఖకూపములనుండి జనుల నుద్ధరించి శ్రేష్ఠమైనదివ్య