యోయోయాంయాంతనుం భక్తశ్రద్ధయా ర్చితుమిచ్ఛతి
తస్యతస్యాచలాం శ్రద్ధాంతామేవ విదధామ్యహం.
ఏభక్తుడు శ్రద్ధతో నేదేవత నర్పించునో యతనికా
దేవతయందు ధృఢమైన భక్తిని నేనే యుంచుదును. 7-21
స తయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధన మీహతే
లభ తే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్.
వాడా నమ్మికను బొంది యామార్గముననే
యారాధింపకోరును. కోరినవానిని నంతటిని వాడు పొందును.
వానినిచ్చువాడను నేనే. 7-22
ఇట్లు మతము సంప్రదాయము, క్రమము, నేవిధమున
నున్నను నెల్లమార్గములును భగవంతునే చేరునని గీతలో
చెప్పబడినది. ఆకాలమున జనులనుసరించివచ్చిన మతముల
మార్గములను సంప్రదాయములనుగూర్చియే చెప్పబడినది.
తరువాతవచ్చిన యితరమతములను క్రమములనుగురించి
అప్పుడు చెప్పుటకు సాధ్యముకాదుగదా! అయినను,
చెప్పినవాక్యములలో తరువాత వచ్చినమతములను యన్నిటి
నుద్దేశించి చెప్పిన మాట యని మనము గ్రహింపవచ్చును.
ఎల్లమతముల నంగీకరించియున్న మాణిక్యముల
వంటి యీ వాక్యములను మనము గౌరవించి యాచరణలో
పెట్టవలెను.