Jump to content

పుట:SriAndhrakaviTharangeniSamput6.djvu/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కృష్ణమా చార్యు ఁ డు 7

ర్యుని తమసంకీర్తన లక్షణమున పేర్కొనుటచే పైకాలము ధ్రువమగుచున్నది. అన్నమయ్యగారి మనుమడు చిన్నన్న తనపరమయోగివిలాసమున నీతని ప్రశంసించియున్నాడు. ఇంతేకాక ఆచార్యసూక్తిముక్తావళియందు కృష్ణమాచార్య ప్రశంసకలదు. వీనినిబట్టి చూడ కృష్ణమాచార్యుడు వైష్ణవమతవాఙ్మయమున కాంధ్రదేశమున ప్రథమాచార్యు డని చెప్పునొప్పును.

ఈతడు సింహాచలక్షేత్రనివాసియని సింహాచలనరసింహస్వామికి భక్తుఁడై యతనిపేర ననేకసంకీర్తనలు రచియించెనని సింహాచలక్షేత్రమాహాత్మ్యచరిత్రము తెలుపుచున్నది. సింహగిరినరహరి వచనము లనుపేర సంకీర్తనలు కృష్ణమాచార్యులవారివి నేటికిని వెలయుచుండుటచే నిది నిజమని చెప్పనొప్పును. ఆచార్యసూక్తిముక్తావళిలో—

కృష్ణమాచార్యుల కీర్తనలనియు
                      నిత్యభోగములయ్యె నేటి కైన
మఱికొన్నినాళ్లకు మల్కినేబనువాడు
                      మ్లేచ్ఛాధిపతి వచ్చి మిన్నురాయు
దివ్యవిమానంబు తెగటార్చి కోవెల
                      బారచాపల తైలభాసితముగఁ
జుట్టించి కాల్చిన సుడిసి యేడహములు
                      కాలి భక్తోక్తిచే గదలకుండె

అని యొకయైతిహ్యము (విస్తరభీతి నీయ్యైతిహ్యము నీయలేదు) కూడ పైవిషయమును ధ్రువము చేయుచున్నది.

మఱియు తిరుపతిక్షేత్రముపై మహమ్మదీయులు దండెత్తి వచ్చినపుడు శ్రీ వేంకటేశ్వరస్వామిని సంబోధించుచు చెప్పిన వేంకటాచలవిహారశతకమునకూడ—

"కృష్ణమాచార్యు సంకీర్తనంబులఁ జిక్కె
సింహాద్రియప్పని చేతగాదు”

అనువాక్యము కృష్ణమాచార్యుని సింహాచలక్షేత్రవాసమును, అతనిసంకీర్తనప్రశస్తిని తెలుపుచున్నది.