పుట:Shrungara-Savithri-1928.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

3


బదరికాశ్రమమందుండి యిదిగొ యిపుడు
వెడలి వచ్చితి నొకవార్త విన్నవింప.


గీ.

గాలి చొరరాకయున్న యక్కాననమున
నొక్కనృపుఁ డెవ్వఁడో కాని యుగ్రతపము
సేయఁ గూర్చుండె నాతపస్స్థితికి నాక
వనము నీఱయ్యెఁ గువలయం బనువుదప్పె.


సీ.

ఏమి కావలె నంచు నెదుటఁ దోఁచి విధాత
                 యెంత వేడిన వచియింపఁ డయ్యె
వరము లిచ్చెద నంచు హరి మ్రోల వేంచేసి
                 లె మ్మన్న నింత చలింపఁ డయ్యె
ఫల మొసంగితి నంచు భవుఁడు ప్రత్యక్ష మై
                 మొనసినఁ జే యెత్తి మ్రొక్కఁడయ్యె
చాలు మెచ్చితి నంచు శాంభవి యటు నిల్చి
                 చేయి చూపినను వీక్షింపఁ డయ్యె
విబుధకులనాథ, తపము నా వినమొ కనమొ
నాటితరమైన తపముచందంబు గాదు
తెలియఁ గోరిక యెద్దియో తేటవడదు
వింత యై తోచె నేమని విన్నవింతు.