పుట:Shriiranga-mahattvamu.pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

తృతీయాశ్వాసము


ఉ.

మేదినిపై విభీషణునిమిత్తమునం గరుణామయాత్ముఁడై
యాదట రంగమందిరమునందు భుజంగమరాజశాయి-ప
ద్మాదయితుం డజస్రమును దా వసియించుటఁజేసి కాందో
పాదుల నేయుప్రదవము నందవు నా సరసీసరిత్స్థలుల్.

173


క.

అని మఱియు నప్పరాశర
తనయుఁడు సునయుఁడగు నాగదంతునితో ని
ట్లను మునిజనములచేమును
వినఁబడు కథయొకటి నీకు వినిపింతుఁ దగన్.

174


తే.

ఏల నీచోళమండల మెల్ల నేలు
రాజదోషంబు కతన ధరాజనంబు
వనరి వసియింపఁ బండ్రెండు వత్సరములు -
పెచ్చు పెఱిగె ననావృష్టిపీడనంబు-

175


సీ.

కడుఁ బేర్చి మిటమిటఁ గాయు కట్టెండచే
భువనముల్ పొరపొరఁ బొక్కిపడియె,
వేఁడియై బిసబిస విసరుగాడ్పులఁ బ్రాణి
తతు లెల్లఁ దటతటఁ దాఁక దొణఁగె,
నొండెడ భగభగ మండు కార్చిచ్చుల
బెనుగిరుల్ పెటపెటఁ బ్రేలఁజొచ్చెఁ
బంకమై జవజవ నింకు శాదంబుల
మలమల మకరాళి మాడిపోయె


తే.

నెండ చొఱకుండఁ గడు నేఁచి యిరులు గొనుచు
వఱలు కాంతారపంక్తులు వళ్లుపోయె,
నట్టనడువేసవులను గాల్నడలు గాక
జరగు నేఱులు నిర్జనస్థలము లయ్యె.

176


శా.

క్షుత్తృష్ణాదిక వేగతా పరిగతానుప్రాణ శల్యావళీ
భిత్తాకీర్ణమహార్ణవాంతిక మహీభృత్కందరారణ్య శు
ష్యత్తోయాశయ తీర చైత్య మరుదేవాగార రథ్యాదులన్
నృత్తం బాడుచు మృత్యుదేవత సమున్మేషించె హేలాగతిన్.

177