పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

33

2వ అధ్యాయము.

స్థలములందు శీతలముచేత నీరుగడ్డకట్టి మరల వేడికి కఱగి నీరగును. బ్రహ్మమే యీఅనంతజలరాశి. మంచుగడ్డగా గట్టిపడినభాగములు ఆ బ్రహ్మముయొక్క పారమార్ధికసాకార రూపములు. భక్తునిఅనురక్తి శ్రద్ధ ఆత్మార్పణము అనునవియే శీతలము. మఱియు "నేను, నేను" అనుచుండెడు అహంకారము రూపుమాసిపోవు నిర్వికల్పసమాధిని చేకూర్చుజ్ఞానవిచారమే ఉష్ణము.

106. భక్తునకు భగవంతుడు అనేకరూపములతో ప్రత్యక్షమగును కాని, సమాధియందు బ్రహ్మజ్ఞానాగ్రముంజేరువానికి నిరాకారమై, నిరంజనమై, ఆతడు తిరిగినిర్గుణబ్రహ్మముగ సిద్ధమగును. భక్తిజ్ఞానముల కిటుల సామరస్యము అమరుచున్నది.

107. నిప్పునకు ప్రత్యేకరూపములేదు; జ్వలించుచున్న బొగ్గులందు అది వివిధరూపముల తాల్చుచున్నది. అప్పుడునిరాకారమగుఅగ్ని సాకారిఅగుచున్నది. అటులనే నిరాకారబ్రహ్మము ప్రత్యేక రూపములను వహించుచుండును.