పుట:ShivaTandavam.djvu/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సర్వలోక సమస్త భూతకోటికి మోదము గూర్చునది ఈ శివతాండవము. ఇద్దాని వర్ణించు కవి తపస్విగా నుండవలయును. ప్రస్తుత గ్రంథ రచయిత అగస్త్యేశ్వరు నుపాసించి, అద్దేవుని కృపాకటాక్షమునకు పాత్రులై శివ తాండవమును, నంది నాందిని, శివాలాస్యమును, విజయా ప్రార్థనమును ఓజోగుణాన్వితముగా, కర్ణరసాయనముగా అభివర్ణించి చదువు వారికి, వినువారికి తదాత్మ్యానుభము కల్గించునట్లు ఉత్తమ కావ్యసృష్టి కావించియున్నారు. కావ్యమునకు పరాకాష్ట "నైతావద్ ఏన పరో అన్యద్ అస్తి" అను ఋగ్వేదసూక్తి. (కేవలమిదికాదు, పరమైనది వేరుగ నున్నది అని స్ఫురింపచేయుటయే.)

వీరు ఈ వస్తు ప్రదర్శనమున శివకేశవులకు అభేద ప్రతిపత్తిని సాధించినారు. సర్వసృష్టి చైతన్యస్వరూపమే నటరాజు తన భక్తిని లీలగా సంకల్పించి, సృష్టిజాలమును సృజించి, తాను వేరైన శేషశయనుడు-రంగనాథుడు లీలానృత్యమునకు ప్రయోక్త. నటునికి ప్రయోక్తకు కార్యభారమున ఏక వ్యక్తిత్వము కలదు. శివము సాధించుటే కైవల్యమును పొందుట!

ఇంతేగాక శివతాండవముచే కలుగు ఆనందప్రీతికయే గిరిజాదేవి. తాండవించు శివుని శరీరములో ఆమె సాబాలు పంచుకొన్నది.

ఇట్లే కేశవ మోహినీరూపములు. స్త్రీ పురుష సమన్వయ మిచ్చటను పరిస్ఫురించును. ర్యాలి యందలి శిల్ప ప్రతిష్ఠలో భాసించునది ఈ అర్థనారీశ్వరత్వమే. శివశివా సమ్మేళనము పార్శ్వానుక్రమము. కేశవ మోహినీత్వము ముందు వెనుకల సమన్వయము.

తెలిసికొనవలసినది తత్త్వ మొక్కటియని; రెండవది లేదని.

                                                                     నే. శ్రీకృష్ణముర్తి

మూలస్థానేశ్వరాలయము

విక్రమసింహపురి

24-6-1961