పుట:ShivaTandavam.djvu/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పదకింకణులు నటరాజు ఆహార్యము. అంగ ప్రత్యంగ ఉపాంగ చలనము తారహారముల కదలాట, సుందర మంజీరకింకిణులూ, కుండల విలాసమూ, చంచల హస్తాభినయమూ, నృత్తనృత్య తాండవగతులూ, ఆయన ఆంగికము. జిగజిగలాడే నక్షత్ర కలాపము, ఫక్కున నవ్వు కైలాసశిఖరములు, ధిమిధిమి ధ్వనులూరు గిరిగర్భములూ, నాట్యములు వెలయించు నదులూ జలదాంగనలై వచ్చిన వియచ్చరకన్యలూ ఆయన నాట్యరంగ ప్రసాధనము. షడ్జద్వయము నందించు వేణు మయూరములూ, పంచమ మాలపించు పికమూ, నిషాదమును తరుము వెనకయ్య బృంహితమూ, ఆ నాట్యములోని స్వరనాదములు. గంధర్వులు, అచ్చరలు, కిన్నరులు, నిర్జరులూ, దిక్పాలకులు, మునులూ, శరజన్ముడు, విఘ్నేశ్వరుడు, అమ్మవారు, బ్రహ్మ, సరస్వతి, శ్రీపతి, లక్ష్మి, చంద్రుడు, సర్వలోకాలూ ఆ మహానాట్యానికి ప్రేక్షకులు. కవిగారి వ్యుత్పత్తి తీర్చిన ఈ శివతాండవములో పై సమ్మర్దము పూర్తిగా నిండుగా కానవస్తుంది.

నారాయణాచార్యులుగారు విజయనగరాస్థాన విద్వద్వరేణ్యులు తాతాచార్యుల వంశములోనివారు. విజయనగర సారస్వత విభూతి వీరి రచనలో అక్కడక్కడ మెరుస్తూ ఇంపు గొలుపుతుంది. ఆంధ్ర వాజ్మయానికి అభిశాపరూపమైన చంపూ పద్ధతిని వీడి ఈయన తెలుగు జిగిని చక్కగా వెలయించగల పదఛందస్సును స్వీకరించుట ఈయన చైతన్యమును ప్రకాశింపజేయు దీపము.

శివతాండవమును విన్న తర్వాత వీరినోట కృష్ణలీలలు వినాలని వున్నది నాకు! మరొకమారు వినండి శివతాండవము.

శ్రీపాద గోపాలకృష్ణమూర్తి.
19-7-1961