Jump to content

పుట:ShivaTandavam.djvu/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తాండవ ప్రశస్తి


శ్రీ ఆనందకుమారస్వామి 1924లో శివతాండవమను పేర ఆంగ్లమున నొక వ్యాస సంపుటి ప్రచురించెను. ఆ గ్రంథము నేటికిని రసజ్ఞులకు మోదము కూర్చుచున్నది. అందొక వ్యాస ఖండమున శివతాండవ తత్త్వము వర్ణింపబడియున్నది.

సర్వ ప్రపంచ సృష్టిస్పందనములే నృత్య భంగులు. ఆరభటీ వృత్తి సమ్మిళితము తాండవమనియు, కైశికీ సమ్మతమైన లాలిత్య శోభలతో నిండినది లాస్యమనియు విబుధుల నిర్వచనము. భర్తృదారికయగు ఉత్తరకు బృహన్నల నేర్పినది లాస్యమని తిక్కన పేర్కొనెను.

సృష్టి పరమేశ్వర లీలయని వేదాంతుల ప్రవచనము. ఈ లీలయే - పరమ వస్తువు - ఏకైక సత్యము యొక్క వ్యక్తరూపము. ఈ భ్రమించుటనే పరమమని నమ్మినవారు భ్రమ పాలగుదురు. ఈ చైతన్యరూపము నుపాశించి, అద్దాని కతీతమైన ముాలపదార్ధమే సర్వమని, అద్దానికి రెండవది లేదని తపస్వులు తురీయావస్థ యందు కనుగొని, అనుభూతులపొంది ఆ పరమస్థితియందు తాదాత్మ్యమును పొందిరి. అట్టివారు ఈనాటికిని కైవల్యస్థితిని చేకూర్చుకొనగలరు.

ఈ రీతి విపరీతమే - లౌకికదృష్టిలో !

ఈ తాండవ తత్త్వమును మూడూ విధములుగా మీమాంసీకరించవచ్చును. సర్వ ప్రపంచ సృష్టి స్పందన చైతన్య స్వరూపమే శివనృత్యము. అఖిలాండ బ్రహ్మాండ కోటులు అనంతముగ వివిధ భంగులలో కదలుచుండును.

రెండవది: భ్రమనొంది పాశబద్ధులైయుండు జీవకోట్లకు ముక్తి నొసంగు సంహారక్రియా ప్రతీకయే ఈ ప్రళయ తాండవము. పునస్సృష్టికి వలసిన పరమ సమకూర్చునదియు ఈ తాండవమే.