ఈ పుట ఆమోదించబడ్డది
సమమధ్యదృతగతులు జరణముల, ననుకూల
భ్రమణములు నడుములోఁ బ్రౌఢములు వ్యాకృతులు
బయిపైని గప్పికొను భావబంధంబులును
నూరేసిగజ్జియల[1] నులివులో వేదములు
దీరైన నృకపాల హారములు గానములు
తొలుకాడు గంగమ్మ యలలలోఁ దానములు
మొలిపించి, జందురుని మొగముపైఁ జిఱునగవు
లాడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు
భరతముని ముందుగాఁ బదపద్మములుబట్టి
"హరహరా!" యని ప్రమోదాయత్తుఁడై దూఁగఁ
తనసృష్టిగర్వంబు దలిఁగిపోఁగ విరించి
కనులలో బాష్పములు గట్ట డీల్పడి నిలువ
నావైపు నీవైపు నష్టదిక్పాలకులు
కేవలము రసమూర్తులై, విశ్వమును మఱువ
దన వేయికనులు జాలని బిడౌజుడు, గౌత
ముని శాపమున గొఱంతనుఁ గూర్చి చింతింప
నాడెనమ్మా! శివుఁడు
పాడెనమ్మా! భవుఁడు
- ↑ ఒక్కొక్క కాలియందు నురేసిగాని, యిన్నూరేసిగాని దక్షిణపాదమున నూరు వామపాదమున నిన్నూరుగాని గజ్జెలు గట్టికొనవలెనని నాట్యాచార్యమతము.