Jump to content

పుట:ShivaTandavam.djvu/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వామపాదము జక్కఁగా మహిని నాటించి
నేమమున దక్షిణము నింత మీఁదికి నెత్తి
యుయ్యాలతూఁగుతో నూగులాడఁగ మధ్య
మొయ్యనొయ్యన మువ్వ లూగి నవ్వులు నవ్వ

        నాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

కుడికాలి నంబువలెఁ గొంచెముగ మునువంచి
యెడమపాదము వైపు నింతశీర్షము వంచి
కమలనాళములు హస్తములు బారలు సాచి
ప్రమదమ్ముతో రెండువైపు లల్లనఁ జాచి
సవ్యవక్షము బులకచయముతో నుబ్బంగ
సవ్యేతరము సిగ్గుతో వెన్క కొదుగంగ
నొక గపోలము నగవు వికసించి రాగిల్ల
నొక గపోలము బిగువు బ్రకటించి తోపిల్ల

        నాడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

ఎడమచేతినిఁ బ్రీతి నడుముపై సంధించి
కుడిచేతిలో నంచకొదమగుఱుతు[1] లగించి
యంచముక్కున దృష్టి నంచితంబుగఁ జేర్చి
సంచాలితమొనర్చి సమశిరము[2] ముందునకుఁ

  1. హంసాస్యము చూ. "హంసాస్యమును రెండు."
  2. చూ. "సమశీర్షకము."