Jump to content

పుట:ShivaTandavam.djvu/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కులుకునీలఁపుగండ్ల తళుకుఁజూపులు బూయ
ఘలుఘల్లుమని కాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

కరశాఖలను నూర్మికలు వోలె లగియించి
కరబంధములనుఁ గంకణములై జిగి నించి
కరరుహంబుల యావకపుజొత్తు బండించి
యఱుత నూతన తారహారములు నిండించి
చరణముల మంజీరసౌందర్యములు గూర్చి
యురముపై నెఱఁబూఁత నెఱసినటు రుచిఁ జేర్చి
యవలగ్నమున మేఖలవలెఁ జఱ్ఱునఁ జుట్టి
శ్రవణములఁ గుండలవిలాససంపద గట్టి
కులుకునీలఁపుగండ్ల దళుకుఁజూపులు బూయ
ఘలుఘల్లుమని కాళ్ళఁ జిలిపిగజ్జెలు మ్రోయ

        ఆడెనమ్మా! శివుఁడు
        పాడెనమ్మా! భవుఁడు

ఎలగాలిపైఁ దేలి పొలయు గీతిక వోలె
నెలపాప బెదవిపై మలయు నవ్వును వోలె
కులపాలికా ముగ్ధ[1] కిలికించితము[2] వోలె
జలదాంగనా లలితసంచారములు వోలె

  1. నవ వివాహిత.
  2. రోషాశ్రుహర్ష భీత్యాదులు నంకరముగా గలుగు శృంగారచేష్ట.