Jump to content

పుట:ShivaTandavam.djvu/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జయ జయ శీతలచంద్రాఽఽభరణా!
జయ జయ కరుణా శరణాఽఽచరణా!
జయ గగనాంబర! శాతత్రిశూలా!
జయ శుభంకరా! జయ మహాకాల!

ఢక్కారవములు పిక్కటిల్ల దశ
దిక్కుల మారుత దీర్ఘీకృతములు
ఝణుఝణుఝణుత స్వనములకును బ్రతి
నినదము లీఁనగ వనధి భంగములు

శూలంబున నాభీలత లేవఁగఁ
గీలాచయములు లేలిహానములు[1]
ధగధగితములై నిగుడఁగ నగవులు
గగనతలస్థులు బెగడ దేవతలు

నీ నృత్తములో నిఖిల వాఙ్మయము[2]
తానముగా మఱి గానము గాగను
తాండవింపఁగాఁ దరుణంబై నది
ఖండేందుధరా! గదలుము నెమ్మది.

జయ నాదలయాఽఽసాదితమూర్తీ!
జయ జయ తాండవ సంభృతకీర్తీ!
జయ గగనాంబర! శాతత్రిశూలా!
జయ శుభంకరా! జయ మహాకాల!

  1. సర్పములు.
  2. సర్వవాజ్మయమును బరమశివుని వాచికాభినయము (అభినయ దర్పణము)