పుట:Shaasana padya manjari (1937).pdf/10

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శాసన పద్యమంజరి.

ద్వితీయభాగ పీఠిక.

ప్రాచీన శిలాశాసనములలో నున్న తెలుగుపద్యములు కొన్ని యిదివఱలో "శాసనపద్యమంజరి" యనుపేర బ్రకటించియున్నారము. ఆ మంజరిలో 88 శాసనములలో నిమిడియున్న 287 పద్యములున్నవి. వానిలో మొదటి శాసనము 770 వ శాలివాహనశక సంవత్సర ప్రాంతమందును జిట్టచివరిది 1600 వ శాలివాహనశక సంవత్సర ప్రాంతమందును బుట్టినవి. ఆ పద్యములు ప్రకటించిన పిదప లభించిన పద్యముల నిప్పు డామంజరిలోనే ద్వితీయభాగముగా బ్రకటించుచున్నారము. ఇందు 46 శాసనములలోగల 95 పద్యము లున్నవి. ఈశాసనములలో మొదటిది 1046 వ శకసంవత్సరములోను జివరిది 1732 వ శకసంవత్సరమున బుట్టినవి. ఈ రెండుభాగములలోని పద్యములను గలిపి కాలానుక్రమముగా నేర్పఱించి యొక్క సంపుటముగా బ్రకటించుట యుక్తముగా నుండెడిది. కాని ప్రథమభాగము పుస్తకము లన్నియు నమ్ముడువడకుండుటచే నట్లు చేయుటకు వీలు లేకపోయినది. ఇప్పుడు విడివిడిగా నుండు భాగములు రెండును వ్యయమైన పిదప నారెండుభాగముల పద్యములను గలిపి యొక్కపుస్తకముగా ముద్రించెదము.

ఈ శాసనములలో గొన్ని "South Indian Inscriptions" (దక్షిణ హిందూస్థాన శాసనములు) అను గ్రంథములనుండి గ్రహింపబడినవి. ఈవిషయ మాయాస్థానములయందు వక్కాణింపబడినది. ఇవిగాక తక్కిన శాసనము లన్నియు శాసనప్రతిబింబములను బట్టి ప్రతులు వ్రాసినవియే.

పద్యములు శాసనములయం దున్నవియున్నట్లే ముద్రింపబడినవి. ప్రాచీనగ్రంథలేఖన సంప్రదాయమునుబట్టి పాఠకులు తమంతట దాము సవరించుకొనదగిన తప్పులను విడిచిపెట్టి మిగిలినవానికి సరియైన పాఠములు పుటల యడుగున జూపబడినవి. ఈవిషయమందును, ఇతర విషయములందును గూడ బ్రథమభాగ విషయమున గమనించిన యేర్పాటులనే యీభాగవిషయమున గూడ గమనించినారము. ఈరెండు భాగములను జేర్చి యొక్కగ్రంథముగా భావించి చదువుకొనుట యుచితము.

జ. రామయ్య.