పుట:Saundarya-Lahari.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

సౌందర్యలహరి


యందు, స్వతన్త్రం = శక్తమగు, తే = నీయొక్క, ఇదం = ఈ, తన్త్రం = సిద్ధాంతము, క్షితితలం = భూతలమునుగూర్చి, అవాతీతరత్ = దిగెను.

తా. తల్లీ, ఈశ్వరుఁడుఆయాసిద్ధుల కనుగుణములగు అఱువదినాలుగు మాయాశంబరాదితంత్రములచే లోకమును వంచించి వశపఱచికొని క్రీడించుచుండెను. అంత మఱల నీబలాత్కారమువలన చతుష్షష్టితంత్రములలోఁ జెప్పఁబడిన యెల్లసిద్ధాంతముల యాకారముగల సర్వపురుషార్థసాధనహేతువగు నీయీతంత్రము ఈశ్వరునిచేఁ జేయఁబడి నీచే నుపదేశమును బొంది భూతలమునకుఁ దేబడియెను.

అవ. ఆసకలపురుషార్థసాధక నూతనతంత్రమును వివరించుచున్నారు. -

శివశ్శక్తిః కామః క్షితిరథ రవిశ్శీతకిరణః
స్మరో హంసశ్శక్రః తదను చ పరామారహరయః,
అమీ హృల్లేఖాభిస్త్రిసృభిరవసానేషు ఘటితా
భజన్తే వర్ణాస్తే తవ జనని నామావయవతామ్. 32

టీ. హేజనని = ఓతల్లీ, శివః = కకారము, శక్తిః = ఏకారము, కామః = ఈకారము, క్షితిః = లకారము, అథ =తరువాత, రవిః = హకారము, శీతకిరణః = సకారము, స్మరః = కకారము, హంసః = హకారము, శక్రః = లకారము, తదనుచ = అటుపిమ్మట, పరామారహరయః-పరా = సకారము, మార = కకారము, హరయః = లకారము, అమీ = ఈ, వర్ణాః = వర్ణములు, త్రిసృభిః = మూఁడగు, హృల్లేఖాభిః = హ్రీంకారములచేత, అవసానేషు = మూఁడుచివరలయందు, ఘటితాః = కూర్చఁబడినవై, తవ = నీయొక్క, నామావయవతామ్-నామ = నామధేయమునకు, అవయవతాం = అంగములగుటను, భజన్తే = పొందుచున్నవి.

(క ఏ ఈ లహ్రీం, హసకహలహ్రీం, సకలహ్రీం, ఇదియె దేవీనామాత్మక నూతనతంత్రము.)