పుట:Saripadani Sangatulu by Bellary Raghava.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మొదటి యంకము.


శించి, రాజా వీరణ్ణశెట్టి ఏదో ఒక కేసుకు వచ్చియున్నాడు అని చెప్పును. భీమసేనరావు తొందరగా షర్టు వేసుకొనుచు) ఇక్కడికే రమ్మనుమయ్యా.

(రాజా వీరిణ్ణ శెట్టి-ప్రవేశము)

శెట్టి:--దండము, స్వాములవారికి దండము

భీమ:--దండము, రండీ శెట్టిగారూ! కూర్చోనండి. ఏమిటి విశేషము?

వీరణ్ణ;--అయ్యగారికి నిండా పనివున్నట్లుందే! అయ్యగారికి ఎప్పుడు పనే! పురుసత్తేలేదు.

భీమ:--వకీళ్లకు పురుసతుంటే ఎట్లుండీ? మేమంత పూర్వకాలపు వాండ్రు. ఇప్పుడువచ్చే వచ్చే వకీళ్లకు పురుసత్తే ఎక్కువ. దానిలో ఈ మునిసిపల్ చేర్మనుపని ఒక్కటి.

శెట్టి:--దాంట్లో ఏమీఫాయిదా లేదండీ! మీరు ఎందుకు ఊరకే కష్తపడుతారో!

భీమ:--శెట్టిగారూ! నాఫాయిదాకొరకా నేను చేర్మనుపనిచేయుట? లోకులకు ఎంత ఉపకారము చూడండీ! ఊరికి కొలాయిలు తెప్పించినాను. మనుష్యులకు, పశువులకు, ఎంత సహాయము చూడండి!

శెట్టి:--కాదుస్వామీ! మార్కెట్టులొ అంటారు- కొళాయిలు తెప్పించినది మీకంటే ముందుండిన చేర్మన్ గారంటనే?

భీమ:--కొళాయిలకొరకు బునాదిలో సర్కారువారితో నేనెంత కొట్లాడినది లోకులకు కేమి తెలియును? నేను ప్రవేశించిక పోతే కలెక్టరు ఒప్పుకొను చుండేనా? మార్కెట్టు మాట కేమిలెండీ? మనవూరి మార్కెట్టులో వ్యాపారములో మూటలు తక్కువైతే మాటలు ఎక్కువై యుండును. అదిసరిగాని, మీరువచ్చిన పనియేమి?

శెట్టి:-- ఏమియులేదు. కొంచెము రికార్డుచూడవలెను. ఆసామినాపైన మునిసిప్ కోర్టులో కంట్రాక్టు దావావేసినాడు. చిన్నపని.

12