Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

197

కాని పనులకు దగినట్టుగా మనకు ప్రొద్దుతక్కువగూడ నిప్పుడే. ఇంచుమించుగా రెండుగడియలప్రొద్దెక్కిన గాని సూర్యభగవానుడు మంచుతెఱలు చించుకొని బయటకు రానేరాడు. వచ్చినప్పుడైన నించుకసేపు నిలువబడనే నిలువబడడు. ఆనిలిచిన కాసేపైన చుఱుకైన యెండ నీయడు, “ఆరోగ్యం భాస్కరాదిచ్ఛే న్మోక్షమిచ్ఛే జ్జనార్దనాత్" అన్నట్టుగా మన కాయురారోగ్యములను బ్రసాదించు ఆదిత్యు డిట్లు జడుడై మందుడై తూర్పుమూలగాబుట్టి దక్షిణపుమూలగా నడ్డత్రోవనుబడి యతివేగముగా బశ్చిమాద్రికి బరువులెత్తుచుండ మనకు అహములెట్లు సన్నముగారుండును? ఱేపు శిశిరుడువచ్చి పండుటాకు లూడగొట్టినట్టులే సూర్యునిబద్ధకమునుగూడ నూడగొట్టినగాని ఆయనకు మనకునుగూడ చుఱుకురాదు. అంత వఱ కింతే. కల్పలతా! నా కీసూర్యుని శీఘ్రగమనంబు గనిన


"పొడుపుఁగొండమీదఁ బొడుచుట మొదలుగా
 బరువువెట్టి యినుడు పశ్చిమాద్రి
 మఱుఁగుఁజొచ్చెఁగాక మసలినఁ జలిచేతఁ
 జిక్కెఁ జిక్కెననఁగఁ జిక్కకున్నె?”


అని సూర్యుడు తానుగూడ చలివాతబడుదునని పరువులెత్తుచున్నాడను శ్రీమద్భాగవతములోని పద్యము జ్ఞాపకమువచ్చి నవ్వుకొనుచుందును. శుభప్రదమైన ఉత్తరాయణ పుణ్యకాలమువచ్చినగాని మన కీపనులవడిదుడుకు లడగవు.

సంక్రాంతియనునది మనకొక సామాన్యమగు పండుగయేగాక గొప్ప ఆరోగ్యోత్సవమనికూడ చెప్పవచ్చును.