Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/843

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

ఛత్రపతి శివాజీ మహారాజు

ప్రబల విరోధులైన మొగలులతో మంతనములు జరిపెను. మొగలు రాజప్రతినిధి మురాద్‌బక్షీతో సంబంధ మేర్పరచుకొనెను. అంతకు పూర్వము అహమ్మద్‌నగరములో మొగలుల నెదిరించిన శహాజీని క్షమించి, బిజాపూర్ రాజుల చెరనుండి ఆతనిని విడిపించినచో నతడు మొగలులతో చేరు ననియు, తాను కూడ మొగలాయి ప్రభువులకు విధేయుడనై యుండెద ననియు రాయబార మంపెను. కాని ఆ ప్రయత్నము సఫలము కాలేదు. బిజాపూరు సుల్తాను శహాజీని రాజధానికి తెప్పించి మొగలులతో చేరకుండ మర్యాదలుచేసి తనవానినిగ జేసికొని విడుదల చేసెను. 1648 లో బిజాపూర్ సుల్తాను రోగగ్రస్తుడగుటచే పురందర దుర్గాధిపతి స్వాతంత్ర్యమును ప్రకటించెను. శివాజీ సమయస్ఫూర్తికలవాడు. పురందర దుర్గాధిపతి తనసోదరులకు భాగమియ్యకుండుటను గమనించి, ఆ సోదరుల నడుచు చీలికలు కలిగించి ఆ దుర్గమును స్వాధీనమొనర్చుకొనెను. 1656 లో జావళీ, రాయగడములను తనవిగా జేసికొనెను. జావళీకోటకు సమీపమున ప్రతాప గడమను కోటను నిర్మించెను. అదే కోటయందు మహాశక్తి భవాని దేవాలయమును స్థాపించెను. ఆ దేవియందు శివాజీకి అత్యంత భక్తి ప్రపత్తు లుండెను. భవానీదేవి యాదేశము ననుసరించియే శివాజీ తన కార్యకలాపములను జరిపినట్లు అతని అనుచరుల విశ్వాసము. శివాజీ కరవాలమునకు 'భవానీ'యని పేరుండెను. సూపా అను కోట గూడ ఈ సందర్భముననే వశమయ్యెను. 1656 లో సూపా, బారామతి, ఇందాపూర్, పురందర్, రాజగడ్, కోదాణ, తోరణా, రోహిడా, టికోణా, లోహగడ్, రాజమాచ్ దుర్గములు శివాజీ అధీనము లయ్యెను. సింహగడ్ అను కోటను పట్టుకొను సందర్భమున శివాజీ తన ప్రాణమిత్రుడైన తానాజీ మాల్ సురేఅను మహావీరుని కోల్పోయెను. తానాజీ మరణము శివాజీ జీవితమున అత్యంత విషాద ఘట్టము. నవంబరు 4, 1656 బిజాపూర్ సుల్తాను మహమ్మద్ ఆదిల్ షా మరణించెను. ఈ సంఘటనము శివాజీ కార్యక్షేత్రమును మరింత శక్తిమంతము గావించినది.

శివాజీ స్వాతంత్ర్యమును వహించి జాగరూకతతో రాజ్యసంరక్షక కార్యమును నిర్వహించుచు మొగలుల జోలికి పోలేదు. బిజాపూర్ సుల్తాను లతనికి మొదటి నుండియే శత్రువులు. ఇక మొగలులను కూడ ఎదిరించినచో తన ప్రయత్నము వమ్ముకావచ్చునని అత డూహించి యుండును. 1653 నుండి మొగలుల అధీనమున నున్న దక్షిణభారతమునకు రాజప్రతినిధిగా ఔరంగజేబు పరిపాలించుచుండెను. ఆదిల్‌షా మరణము తర్వాత ఔరంగజేబు బీజాపూరును లోగొనుటకు ప్రయత్నము లారంభించెను.

బిజాపూరు సుల్తాను శివాజీని లొంగదీయుటకు అఫ్జల్ ఖానును పంపించెను. శివాజీని కౌగలించుకొని, నలిపివేసి చంపుటకు బలాఢ్యుడైన అఫ్జల్ ఖాను ఎత్తు వేసెను. శివాజీ ఆ మోసమును తెలిసికొని, తానును మోసమునకు పూనెను. ఇద్దరు మోసగాండ్రు పెనగులాడినపుడు తెలివి గలవాడు జయించును. స్నేహితుని వలె ఖాను శివాజీని కౌగలించుకొని, క్రమముగా బిగించుచు, తన దురుద్యోగము నకు కడంగ నుండగా, శివాజీ తాను గుప్తముగా ధరించి యున్న “బిఛువా" (పులిగోళ్ళు) తో చీరి, వానిని చంపివేసెను. ఆ తర్వాత మహారాష్ట్ర వీరులు అఫ్జల్ ఖాను వెంట వచ్చిన సైన్యమును సర్వనష్టములకు గురిచేసిరి. 1659 నుండి 1662 వరకును శివాజీకిని, బిజాపూరు సుల్తానులకును జరుగుచుండిన యుద్ధము ఏతము త్రొక్కినట్లుగ నుండెను. 1662 లో బిజాపూరు సుల్తానులు శివాజీ ధాటికి ఆగలేక తమ రాజ్యములోని కొంత భాగమును శివాజీ కిచ్చి సంధిచేసికొనిరి. పూనా మొదలుకొని కృష్ణానది వరకున్న విశాల భూభాగము శివాజీ కీ విధముగ దత్తమయ్యెను.

బిజాపూరు సుల్తానుల నీ విధముగ లొంగదీసికొని, శివాజీ శక్తిమంతమైన మొగలాయి సామ్రాజ్యముపైకి కత్తిదూసెను. మొగలులపై అతడు యుద్ధము ప్రకటించు నాటికి మొగలు చక్రవర్తి ఔరంగజేబు దక్షిణమున తన ప్రతినిధియైన షాయిస్తాఖాను అనువానికి శివాజీని అదుపులో నుంచుట కాజ్ఞచేసెను. షాయిస్తాఖాను శివాజీ అధీనమునం దున్న పూనా, చాకన్, కల్యాణదుర్గములను జయించి, పూనాను తన కార్యకలాపములకు కేంద్రముగ చేసికొనియుండెను. మోసముచే నైనను శత్రువులను లొంగదీయవలయునను నీతిని అనుసరించి మొగలు సైనికుల వేషములతో అనుచర యుక్తముగ శివాజీ పూనా

775