Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/838

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చైనా భాషాసారస్వతములు

సంగ్రహ ఆంధ్ర

'కుమింటాంగ్ ' ప్రభుత్వము రోమన్ వర్ణములను ప్రవేశపెట్ట యత్నించెను. కాని ఈ యత్నము ప్రజానీకము యొక్క అంగీకారమును పొందలేదు. ప్రాచీన చైనీయ లిపి యందలి ప్రధాన ధ్వని చిహ్నములను, మౌలికములు అని ఎన్నదగిన వాటిని సేకరించి ప్రస్తుతము రచనకు, ముద్రణమునకు, టైపురైటింగునకు ఉపయోగించు చున్నారు. నవీన వ్యావహారిక భాషకు ఈ లిపి సవ్యముగనే ఉపయోగ5పడుచున్నది.

సార్వజనిక విద్యా వ్యాప్తి, నవీన సిద్ధాంత ప్రచారము, తద్వారా చైనా ప్రజల సర్వతోముఖ విజ్ఞానాభివృద్ధి చైనీయ భాషా సంస్కరణము యొక్క ప్రధాన లక్ష్యములు. చైనీయ గ్రాంథిక భాషకును, వ్యావహారిక భాషకును విపరీతమైన వ్యత్యాసము కలదు. ఈ వ్యత్యాసమును తొలగించుటకు చాలకాలముగా ప్రయత్నములుజరుగుచుండినవి. సన్ యట్ సేన్ చైనా ప్రజానీకమునందు జాతీయ భావ బీజములు నాటిననాటినుండియు ఇట్టి యత్నములు ఆరంభ మైనవి. ఆ మార్గమును చేపట్టి 1898 వ సంవత్సరము నందు ఖంగ్-యూ-లీ, ల్యాంగ్ చీ - చావ్ అను వారు సారస్వత, వైజ్ఞానిక, రాజకీయ రంగములందు ఒక నూతనోద్యమమును ఆరంభించిరి. గ్రాంథికభాష ప్రజాసామాన్యమునకే కాక, ఒక శ్రేణికి చెందిన పండిత వర్గమునకు కూడ అర్థము కాదు. కనుక ప్రజలు మాట్లాడు వ్యావహారిక భాషయందే గ్రంథరచన సాగవలె ననునది ఈ ఉద్యమ లక్ష్యము. ప్రథమ ప్రపంచ సంగ్రామా నంతరము డా. హుషిహీ అను పండితుడు ఈ ఉద్యమమును పట్టుదలతో తీవ్రముగ సాగించెను. చైనాయందు ఆత్యధిక సంఖ్యాకులు వ్యవహరించు 'మండారిన్' అను మాండలికమును ఇతడు అవలంబించెను. ఈ ఉద్యమమునకు 'పెయ్-హ్వా'(వ్యవహారిక భాషా) ఉద్యమ మని పేరు. చెన్‌టూశ్యూ వంటి తీవ్రసంస్కరణ వాదులును, పీకింగ్ జాతీయ విశ్వకళాపరిష దధ్యాపకులును, విద్యార్థులును దీనిని బలపరచిరి. 1930 వ సంవత్సరమునాటికి ఈ యుద్యమము చైనాయందు బలముగా వ్రేళ్లు తన్నుకొనెను. క్రమముగా పెయ్ - హ్వా పాఠ్యగ్రంథ భాషగా అంగీకరింప బడినది. అన్య భాషా సాహిత్యములనుండి పెక్కు గ్రంథములు ఈ వ్యావహారిక భాషలోనికి అనువదింప బడినవి. పత్రికలు, నవలలు, ఆధునిక శాస్త్రగ్రంథములు కోకొల్లలుగ వెలువడినవి.

దీనివెంట చైనీయ సాహిత్యమున గూడ గొప్ప విప్లవము జరిగినది. 1919 వ సంవత్సరమున చైనా యందలి షాంటంగ్ రాష్ట్రముపై జపాన్ అధికారము ప్రతిష్ఠింపబడినది. దీనికి వ్యతిరేకముగా చెలరేగిన జాతీయోద్యమము యొక్క ప్రభావము నాటి సాహిత్యపరులమీద గూడ ప్రసరించినది. 1919 వ సంవత్సరము మేనెల 4వ తేదీన ఈ ఉద్యమము ఆరంభ మైనది. ఈ యుద్యమ నాయకులు చేసిన ప్రబోధమును అనుసరించి ముఖ్య రచయిత లందరును వ్యావహారిక భాషను అవలంబించి, నిత్యజీవిత వ్యవహారములను ఇతివృత్తముగా స్వీకరించి, సర్వ సుబోధక మగు సరళ శైలిలో గ్రంథరచన సాగించిరి. ఈ మార్గమును బాగుగా వ్యాప్తిలోనికి తెచ్చినవారు చైన్‌శ్వాన్ - టుంగ్, హుషీ, లూశున్, చెన్‌టూ -శ్యూ ప్రభృతులు.

లూశున్ (అసలు పేరు చౌఫ-జెన్) గావించిన రచనలు ఖడ్గతుల్యములైనవి. తీవ్రమైన అపహాసము ఆతని రచనకు ప్రాణము. పెక్కు నవలికలు, కథానికలు, వ్యాసములు ఆతడు రచించెను. నవచైనా సారస్వతమునకు ఆతడు రచించిన 'ఆక్యు' అను నవలిక శ్రీకారము వంటిది. అనంతరము వచ్చిన కమ్యూనిస్టు రచయిత లందరకు ఇతడు గురుస్థానీయుడు. కవిగా, నాటకకర్తగా, నవలారచయితగా విశేషించి విప్లవ సిద్ధాంతవాదిగా, క్వొమో-జో ప్రసిద్ధికెక్కెను. ఇతడు పురాతత్వ పరిశోధకుడు, కమ్యూనిస్టు ప్రభుత్వమున సాంస్కృతిక వ్యవహారశాఖయందు ఇతడు ప్రముఖ డయ్యెను. చైనా - జపాను యుద్ధకాలమున పెక్కు రూపకములు రచించి ప్రఖ్యాతి గన్నవాడు వాన్‌చియా-పో. ఈతని రచనలు పెక్కు విదేశీయ భాషలలోనికి అనువదింప బడెను. ఈ రూపకములు చైనీయ వ్యావహారిక భాషా పటుత్వమునకు విజయ ధ్వజముల వంటివి.

కమ్యూనిస్టు ప్రభుత్వము 1949 వ సంవత్సరములో చైనాయందు నెలకొనిన అనంతరము ఈ విప్లవము మరింత ముందునకు పోయినది. ప్రాచీన చైనా సాహిత్యమును నవీన దృష్టితో పరిశీలించి వ్యాఖ్యానించుట, ప్రాచీన మహా

770