విజ్ఞానకోశము - 3
చైనా భాషాసారస్వతములు
యానుసారముగ కొనసాగుచున్న చేతి పరిశ్రమలు ఇప్పటికిని ప్రబలములై యున్నవి. ఈ స్థానిక పరిశ్రమలు స్వల్పపరిమాణము కలవై తరచుగ సేద్యప్రవృత్తితో మేళవింపబడినవి. లఘు పరిశ్రమలలో నూలు వడకుట, బట్టలను చేతితో నేయుట ముఖ్యమై యున్నవి. ఈ పద్ధతి ప్రకారము దేశమునకు కావలసిన నూలు వస్త్రములు విశేష ప్రమాణములో తయారగుచున్నవి. భారీపరిశ్రమలలో పేర్కొన దగినవి - గనులనుండి బొగ్గును త్రవ్వుట, నేత, సిమెంటును, కాగితమును తయారుచేయుట, పిండి మరల పరిశ్రమ, ఇనుము, ఉక్కు, సబ్బు పరిశ్రమలు విద్యుచ్ఛక్తిని, విద్యుత్పరికరములను ఉత్పత్తి చేయుట మొదలగునవి భారీపరిశ్రమలలో పేర్కొన దగినవి.
చైనా ప్రధాన భూభాగము నేడు రష్యావిధానము ననుసరించి బృహజ్జాతీయ ప్రణాళికను తల పెట్టినది. చైనా, 1953 వ సంవత్సరములో ఒక పంచవర్ష ప్రణాళికను ప్రవేశ పెట్టినది. 1949-1953 సంవత్సరముల మధ్య కాలమున భూస్వాముల వద్ద నుండియు, ఎక్కువ ధనికులయిన రైతులవద్ద నుండియు, దాదాపు పూర్తిగా భూముల హక్కును తప్పించి, ఆ హక్కులు కౌలుదారులకును, చిన్న చిన్న భూస్వాములకును ఇయ్య బడినవి. కాని పూర్వము భూస్వాములకు చెల్లించు చుండెడి శిస్తు కంటె అధికముగా శిస్తును ప్రభుత్వమువారికి కట్టవలసిన భారము నేడు వీరిపై బడినది.
కమ్యూనిస్టు చైనా ప్రణాళికలు పరిశ్రమల కిచ్చు చున్న ప్రాధాన్యము నేడు రష్యాలో పారిశ్రామిక ప్రణాళికకు ఒసగ బడుచున్న ప్రాధాన్యమునకు తుల్యమైనదిగా నున్నది. అనగా గనుల త్రవ్వకము, భారీ పరిశ్రమలు, యంత్రనిర్మాణము, దేశాంతర్గతమైన రవాణా సౌకర్యములలో అభివృద్ధి, విద్యుచ్ఛక్తి సౌకర్యములు వీటికి ప్రాధాన్యము చేకూర్చుచున్నవి. పారిశ్రామికోద్యమమును పెంపొందించుట ఇత్యాది కార్యక్రమములను వడివడిగా సాగించి, పారిశ్రామిక విజయము గాంచవలెనని చైనీయులు యత్నించుచున్నారు.
బి. యన్. చ.
చైనా భాషాసారస్వతములు :
ప్రపంచమునందు అత్యధిక సంఖ్యాకులచే వ్యవహరింప బడుచున్న భాషలలో చైనాభాష యొకటి. చీనో - టిబెట్ భాషా కుటుంబమునకు చెందిన రమారమి 115 భాషలలో చైనాభాషది అగ్రతాంబూలము . ఈ భాషలో మాటాడు ప్రజలు ఏబదికోట్లకు పైబడి యున్నారు. ఈ భాష, దీని లిపి, సారస్వతము అతి ప్రాచీనము లయినవి. లిపికిని ఉచ్చారణమునకును ఎట్టి సంబంధమును లేకుండుట చైనీయ భాషయందలి యొక ప్రత్యేకత. ఈ కారణము వలననే ఈ భాష ఎంత ప్రాచీనమైనదైనను, దానియొక్క పరిణామమును చక్కగా నిరూపించుట కష్టమగుచున్నది. చైనాభాష సుమారు 3000 ఏండ్ల నుండియు వ్యవహారమునం దున్నట్లు తెలియుచున్నది. దీనికి లిపి ఏర్పడికూడ సుమారు 2000 ఏండ్లకు పైబడినది.
చైనీయ భాషయందు మాండలిక భేదములు పెక్కులు గలవు. వీటిలో కొన్ని పరస్పరము ఎట్టి సంబంధమును లేనివని తలపదగినంత భిన్నములుగా నున్నవి. ఇట్టి మాండలిక భేదములు విశేషముగా చీనా సముద్రతీర ప్రాంతములలో వ్యవహారమునం దున్నవి. కేంటానీస్, స్వాటో, ఎమోయ్, ఫూచౌ, వెన్‌చౌ, నింగ్పో, వూ మున్నగునవి సాగరతీర మాండలికములు. మండారిన్ అని పాశ్చాత్యులచే పిలువబడు 'క్వాన్ హ్వా' (అధికారభాష) మాండలికము లన్నింటిలో అగ్రగణ్యము. చైనాదేశమున ఐదింట నాలుగువంతులలో ఈ మాండలిక మే వ్యవహరింపబడు చున్నది. దీనిని మాటాడు జనాభా రమారమి 30 కోట్లకు పైబడి యుండును. ఇన్ని మాండలిక భేదములను ఒక్కటిగా బంధించుచున్నది చైనీయ లిపియే. మండారిన్ మాండలికమునందును ప్రాంతీయములైన స్వల్ప భేదములు పెక్కులున్నను, ఒక ప్రాంతీయభేదము వేరొక ప్రాంతము వారికి సులభముగ అర్థమగుచునే ఉండును. ప్రస్తుతము చైనాదేశ మందంతటను జాతీయ భాషగా ఉపయోగింపబడు చున్నది పీకింగు ప్రాంతీయమైన మండారిన్ భాష. ఈ యుప మాండలికమును 'క్వోయూ' (జాతీయ భాష) అని యందురు. ఇదివరకు గ్రాంథిక భాషగా నుండిన వెన్-లీ స్థానమును ప్రస్తుతము 'క్వోయా' ఆక్రమించినది.
చైనీయ లిపి చాలవరకు భావాత్మకమే గాని ధ్వన్యాత్మకము కాదు. ఉచ్చరించు శబ్దమునకు, లిఖించు వర్ణము
763