విజ్ఞానకోశము - 3
చిత్రలేపనసామగ్రి
(gypsum), పోజోలానిక్ (pozzolanic) అను పదార్థములతో గిలాబా చేయుట. తడిసున్నములో రంగును కలిపి చేయు గిలాబా 'ఫ్రెస్కో బ్యూన్ ' (fresco buan) అను సాంకేతిక నామమున పిలువబడుచున్నది. ఈ విధముగా చేయబడు కుడ్యాలంకారము అన్నిటికంటె శాశ్వతముగా నుండగలదు. ఈ సాంకేతిక పద్ధతి ప్రకారము ఒక్క దినములో పనిచేయ గల విస్తీర్ణము ఆఖరుసారిగా గిలాబా చేయబడి తుదిరూప మొసగబడును. దానిపై రేఖాచిత్రము (cartoon) రచింపబడి, తడి ఆరక పూర్వమే చిత్రముపై మామూలు నీటిలోగాని, సున్నపునీటిలో గాని కలిపిన రంగులు అద్దబడును. రంగులు వేయునపుడు గిలాబా తేమగా నుండుటచే చిత్రమునందు రాసాయనిక పరివర్తనము (chemical reaction) కలుగును. అందువలన రంగులన్నియు గోడయందు చక్కగా లీనమై ఎన్నటికిని మాసిపోజాలవు. లోహసంబంధమైన మన్నుతో తయారైన రంగులనే ఈ సాంకేతిక విధానమునందు ఉపయోగింపవలెను. క్రీ. శ. 14–16 శతాబ్దముల నడుమ నిర్మింపబడిన ఇటలీ కుడ్యచిత్రములును, క్రీ. శ. 16-19 శతాబ్దములనాటి రాజస్థాన్ కుడ్యచిత్రములలో అధికభాగమును ( ఇవి జయపూరు విధానమని పిలువబడును). 'ఫ్రెస్కో బ్యూన్' (Fresco Buan) అను సాంకేతిక విధానమునకు చెందియున్నవి.
ఫ్రెస్కో సెక్కో (Fresco Secco) : ఈవిధానముకూడ కుడ్య చిత్రరచనావిధానమును పోలియుండును. కాని ఈ విధానమునందు గిలాబా (సున్నము లేక మన్ను లేక జిప్సమ్)గాలికి ఆరపెట్టబడును. రంగువేయుటకుపూర్వము తొలినాటి రాత్రియంతయు గిలాబాను పూర్తిగా సున్నపు నీటితో గాని, లేక ముగ్గురాతి (baryta) నీటితో గాని తడిపెదరు. మరుసటి ఉదయము కూడ మరొక పర్యాయము అట్లే చేయవలసియుండును. ముందుగా సిద్ధమై యున్న నమూనా చిత్రమును గోడపైన ఎక్కించు విధానము, రంగులు కలుపు పద్ధతి. కుడ్య చిత్రమునకు వివిధ వర్ణములు దిద్ది తుదిరూపము తయారుచేయు విధానము - ఇది యంతయు కుడ్య చిత్ర విధానమువలెనే యుండును. కొంచెము సున్నపురాతి నీటితోగాని, ముగ్గురాతి నీటితోగాని రంగులు కలుపవలయును. ఇట్టి విధానము నవలంబించినచో చిత్రములను తయారుచేయుట సులభమగును.
కాని ప్రామాణికులైన కొందరు చిత్రకారులు ఈ విధానము కూడ 'ఫ్రెస్కో బ్యూన్' అను తరగతికి చెందిన విధానమే అని భావించుచున్నారు. ఎండిన గిలాబాపై సున్నపు నీటియందు కలిపిన వేర్వేరు రంగులతో రచింపబడు వర్ణచిత్రములు సిసలైన 'ఫ్రెస్కో సెక్కో' తరగతికి చెందినవని వీరి నమ్మకము. కుడ్య చిత్ర విధానము లన్నిటియందును సహజముగా ఇది అత్యంత సులభమైనది. ఈ విధానములో గ్రుడ్డు సొన గాని, లేక గోందుగాని, రంగులను కలుపుటకు ఉపయోగింపబడును. అంతేకాక, సాధ్యమైనన్ని ఎక్కువ సంఖ్య గల రంగులలో వేటినైనను ఈ సాంకేతిక విధానమునం దుపయోగించ వచ్చును. అజంతా, ఎల్లోరా కుడ్యచిత్రములు, మధ్యాసియా, ఈజిప్టు మొదలగు ప్రాంతములందలి సమకాలీన కుడ్యచిత్రములు ఈ విధానము ననుసరించి రూపొందించ బడినవే. చిత్రములను గీయు భూమికను (ground) తయారుచేయుట యందును, రంగులను కలుపు ద్రవపదార్థములయందును కొన్ని భేదము లుండవచ్చును. కళాకారుని అభీష్టమును బట్టియు, ఆయా పదార్థముల లభ్యా లభ్యములను బట్టియు ఈ భేదములు మారుచుండును.
తైలవర్ణచిత్రములు : ఐరోపాలో 16వ శతాబ్దినుండియు తైలవర్ణములు కళాకారులచే మిగుల అభిమానింపబడు చుండెను. అట్లే 19 వ శతాబ్దమునుండి తైలవర్ణచిత్ర విధానము ప్రపంచమున అన్నిదేశములందును ప్రాచుర్యము వహించెను. తైలవర్ణములను జిగురుపాకములో తయారుచేయుటకు, రంగులలో సరిపడునంత పరిమాణములో అవిసెనూనె, గసగసాలనూనె కలుపబడి మెత్తగా నూరబడును. తైలవర్ణచిత్రములు శీఘ్రముగా ఆరిపోవుటకు అవిసెనూనెలో కొన్ని పదార్థములు కలుపబడును. ఇండ్లకు రంగులువేయుటకును. ఇతర అలంకరణము లొన గూర్చుటకును అవసరమైన రంగుల సమ్మేళనము ప్రాచీన కర్మకారులకు (craftsmen) బాగుగా తెలియును. కాని జాన్ వాన్ ఐక్ (Jan Van Eyck) మున్నగు డచ్చి కళాకారులచే వర్ణసమ్మేళన విధానము క్రమముగా అభివృద్ధి చేయబడినది.
691