చిత్తూరుజిల్లా
సంగ్రహ ఆంధ్ర
మ్యునిసిపాలిటీలు (1961) :
1. చిత్తూరు :
| జనాభా | 47,884 |
| పురుషులు | 24,400 |
| స్త్రీలు | 23,484 |
| అక్షరాస్యులు | 23,595 |
2. తిరుపతి :
| జనాభా | 35,836 |
| పురుషులు | 19,258 |
| స్త్రీలు | 16,578 |
| అక్షరాస్యులు | 19,825 |
3. కాళహస్తి :
| జనాభా | 24,468 |
| పురుషులు | 13,347 |
| స్త్రీలు | 13,121 |
| అక్షరాస్యులు | 10,500 |
నైసర్గికస్వరూపము : ఈ జిల్లాను రెండు ప్రాంతములుగా విభజింపవచ్చును. 1. గుట్టలు, పీఠభూములు · 2. మైదానములు.
తూర్పుకనుమల గుట్టలు (మహేంద్ర పర్వతశ్రేణి) నైఋతి మూలనుండి ఈశాన్యమునకు పోవుచుండును. నైఋతి యందలి కలగుండి నుండి బయలుదేరి ఉత్తర -ఈశాన్య (North - North eastern) దిక్కుగా పలమనేరు తాలూకాలో నుండి పుంగనూరు తాలూకా తూర్పు భాగము గుండాపోయి, తూర్పువైపు మరలి, చిత్తూరు, చంద్రగిరి వరకు వ్యాపించును. తిరుపతి కవతల ఈ పర్వతశ్రేణి విభక్తమయి గొప్ప వెడల్పయిన లోయ ఏర్పడియున్నది. ఈ లోయను “మామందూరు” లోయ యందురు. తరువాత ఈ గుట్టలవరుస ఈశాన్య దిక్కుగా ప్రయాణముచేసి, కాళహస్తి తాలూకాను తాకుచు, నెల్లూరు జిల్లాలో ప్రవేశించును. పుంగనూరు, మదనపల్లి, వాయల్పాడు తాలూకాలలో గుట్టలకు పడమట నున్న ప్రదేశము 2000 నుండి 2500 అడుగుల ఎత్తున ఉండి మైసూరు రాష్ట్రపు పీఠభూమితో సరిసమానముగా వ్యాపించియుండును. పీఠభూములగు మదనపల్లి, పుంగనూరు, వాయల్‌పాడు తాలూకాలలోను, తూర్పున నున్న కాళహస్తి, పుత్తూరు తాలూకాలలోను చిన్న చిన్న గుట్టలు అసంఖ్యాకముగా నున్నవి. వీటిలో ప్రాముఖ్యము చెందినవి మదనపల్లి తాలూకాలోని 'హార్ల్సీ' కొండలు, పుత్తూరు తాలూకాలోని నగరికొండలు అయి యున్నవి.
నదులు : ఈ జిల్లాలో కొన్ని నదులు జిల్లా ఉత్తరభాగమున ఉత్తర ముఖముగా ప్రవహించుచుండును. ఇతర నదులు జిల్లా దక్షిణభాగమున తూర్పు ముఖముగాను, దక్షిణ ముఖముగాను ప్రవహించుచుండును.
పాపఘ్ని నది, మైసూరు రాష్ట్రములో ఉద్భవించి, మదనపల్లి తాలూకా పడమటిదిశ చివరనపోవుచు అనంతపురం జిల్లాలో ప్రవేశించును.
బాహుదా నది మదనపల్లి తాలూకాలోని హార్ల్సే పర్వతమునందు పుట్టి, వాయల్పాడు తాలూకా ఉ త్తరభాగమున ప్రవహించుచు, కడప జిల్లాలో ప్రవేశించి పెన్నా నది (Pennar) లో సంగమించును.
పెద్దయేరు, చిన్నయేరు అను రెండు చిన్న నదులు మదనపల్లి తాలూకాలో గలవు.
ఫించనది పుంగనూరు తాలూకాలోని ఆవులపల్లి అరణ్యములో పుట్టి, పుంగనూరు, వాయల్పాడు తాలూకాలగుండా ప్రవహించి, కడప జిల్లాలో బాహుదానదిలో పడును.
కౌండిన్యనది పలమనేరు తాలూకా ఈశాన్యభాగమున దక్షిణ దిక్కుగా ప్రవహించి, తరువాత ఉత్తరార్కాటు జిల్లాలో ప్రవేశించి, చివరకు ఆ జిల్లాలోని పాలారునదిలో సంగమించును.
పాలారు నది, మైసూరు రాష్ట్రమునుండి ఈ జిల్లాలో ప్రవేశించి, పలమనేరు తాలూకా దక్షిణ భాగముగుండా ప్రవహించి, పిమ్మట ఉత్తరార్కాటు జిల్లాలో ప్రవేశించును.
పోయిని నది, తూర్పుకనుమలలో ప్రవహించి, చిత్తూరు తాలూకాగుండా దక్షిణమునకు ప్రవహించి, ఉత్తరార్కాటు జిల్లాలో ప్రవేశించి, ఆ జిల్లాలోని పాలారునదిలో పడును. పోయిని నదికి మూడు ఉపనదులు చిత్తూరు తాలూకాలో గలవు. చిత్తూరు నది, బాహుదా నది, గొడ్డువంక అనునవి ఈ ఉపనదులు.
678