Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/667

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

చదరంగము - 1

రెండువైపులు చర్మముచే మూయబడును. కుడివైపునగల చర్మమునకు మాత్రము 'కరిణి' అని పిలవబడు నొక పూతను పూయుదురు. చిట్టెపురాళ్లు, అన్నము ఈ కరిణి యొక్క ముఖ్యమైన మూలపదార్థములు . ఈకరిణి (కరణి) వలననే నాదము వ్యక్తమగును.

రాగ గీతాదులను అనుష్ఠించుటకు స. రి. గ. మ. ప. ధ. ని. అను సప్తస్వరములు సాధనములైనట్లు తాళ వాద్యములకు త. ది. త్తో. న. ఝం, తరి. కిట తక, వంటి శబ్దములు సాధనములగుచున్నవి. ఈ వాద్యాక్షరములను ‘కొనగోలు' శబ్దములందురు. ఈమృదంగముననుసరించియే డోలక్, తబల మొదలగు వాద్యము లేర్పడినవి. చర్మము నుండి కలుగుచున్న ఈనాదము 'చర్మజ' మనబడినది.

ఘనములు : ఇవి కాంస్యాదిలోహ నిర్మితములు. ఘంట, జేగంట. లేక జయగంట, కంచుతాళము, శుక్తి పట్టము మున్నగునవి ఘనవాద్య భేదములు. ఉత్సవాదుల యందు పదిమంది కలిసి పాడునపుడు కంచుతాళముల నుపయోగింతురు. కంచుతో చేయబడిన రెండుభాగములు హస్తములచే కలుగజేయబడు సంయోగవియోగముల వలన తాళము కలుగుచున్నది.

లౌకికగానమునకు తంత్రీవాద్యమైన తంబుర శృతి వాద్యమైనట్లు, వేదగానమునకు ఆధారశృతి యగు ప్రణవమును ఉచ్చరించుటకు ఘంటప్రమాణవాద్యముగా చెప్పబడినది. అటులనే జేగంటవాదన మొనర్చుచు భగవత్సన్నిధానమున మంత్ర పుష్ప, మంగళహారతులను గానము చేయుదురు. ఇట్లు లోహములయొక్క అభిఘాతమువలన కలుగు ఈ నాదము 'లోహజ' మనబడినది.

ఈ చతుర్విధ వాద్యములలోను ప్రధాన వాద్యము లనియు, సహకార వాద్యములనియు రెండువిధములుగా గలవు. జంత్రవాద్యములలో వీణ, గోటు; సుషిరవాద్యములలో వేణువు, నాగస్వరము ప్రధాన వాద్యములు. తక్కినవన్నియు సహకారవాద్యములు. ఇవి 1. శుష్కము 2. గీతానుగము 8. నృత్తానుగము 4. ఉదయానుగము అని నాలుగు రీతులు గలవు.

1. గీతనృత్యముల ననుసరించని వాద్యము శుష్కము.

2. గాత్రజ్ఞుని అనగా గీతమును అనుసరించు వాద్యము గీతానుగము.

3. నర్తకుని అనగా నృత్యమును అనుసరించు వాద్యము నృత్తానుగము.

4. గీతనృత్యముల రెంటిని అనుసరించు వాద్యము ఉభయానుగము.

ఈ చతుర్విధ వాద్యములు సంస్కృతీ చిహ్నములు. వేదగానమున, ముఖ్యముగా యజ్ఞయాగములందు వీణ, భేరి, మృదంగాదులు అవసరములు. సామగానము వీణపై చక్కగా అనుష్ఠింపబడును.

వివాహాది శుభకార్యములందును, యుద్ధములందు వీరులను ఉత్సాహపరచుట యందును, నాటకములందు నవరసములను పోషించుట యందును ఈ చతుర్విధ వాద్యములు ఉపయోగింపబడును. నర్తకులకును, గాయకులకను విశ్రాంతిని, ఉత్సాహమును కలుగజేయుటయే గాక, వారి వారి లోపములను కప్పిపుచ్చుటకు కూడ ఈ వాద్యము లుపయోగపడును.

పో. శం. శ.


చదరంగము - 1 :

చదరంగమను క్రీడావినోదము యొక్క పుట్టుకను గూర్చి పలువురు చరిత్రకారులు పలువిధములుగా వివరించి యున్నారు. ప్రప్రథమముగా ఈ క్రీడ గ్రీసు, రోము, బాబిలోనియా, ఈజిప్టు, పర్షియా, చైనా, భారత్, అరేబియా, ఐర్లెండు, వేల్సు మున్నగు దేశములలో ఆవిర్భవించి అభివృద్ధినొందినట్లు ఎవరికి తోచిన విధముగా వారు ఊహించి యున్నారు. కళాత్మకమైన ఈ క్రీడావిశేషము జావ్‌హెత్, షెమ్, సాలమన్ ప్రభువు, రావణునిభార్య (మండోదరి), క్సెర్ క్సెస్ అను తాత్వికుడు, పాలమిడిన్ అను గ్రీకుప్రభువు, అరిస్టాటిల్ అను గ్రీకు తత్వవేత్త, పాత్రెన్‌షా అను ప్రసిద్ధ పర్షియను ఖగోళ శాస్త్రవేత్త మున్నగువారు కనిపెట్టి యున్నట్లు మరికొందరు చరిత్రకారులు పేర్కొని యున్నారు. కాని ఈ చరిత్రకారులలో అత్యధికులు వెలిబుచ్చిన ఊహలకు ఆధారము లెవ్వియు కానరావు. రోము, వేల్సు, ఐర్లెండు మున్నగు పాశ్చాత్య దేశములందు స్వల్పముగ చదరంగమును పోలిన జాతీయములైన వినోదక్రీడలు క్రీస్తునకు పూర్వము వ్యవహారమునం దుండి యుండవచ్చును. కాని క్రీడలు శాస్త్రీయము, ఆధికారికమునైన చదరంగ

607