Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/637

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విజ్ఞానకోశము - 3

చంద్రవంక

ద్రాజ వృత్తాంతములు, కలియుగరాజ వృత్తాంతము చదువవలెను.

శ్రీ. సో.


చంద్రవంక :

ఇది గుంటూరు జిల్లాలో ప్రవహించు చిన్ననది. ఇది పల్నాడు తాలూకాలోని శివారుపల్లె పర్వతశ్రేణిలో పుట్టుచున్నది. మాచెర్లవద్ద బాలచంద్రునివలె అర్ధచంద్రాకారమున ప్రవహించును గనుక దీనికి 'చంద్రవంక' అను నామము వచ్చినది. పల్నాటివీరుల చరిత్రలో ప్రసిద్ధికి వచ్చినది. ఈ చంద్రవంక మాచెర్లవద్ద ఉత్తరవాహిని. ఉత్తరవాహినీ స్థలము పరమ పవిత్రమైనదిగా పరిగణించబడుచుండును. ఈ నది ఉత్తరముగా పల్నాడు తాలూకా గుండ ప్రవహించి తూమూరుకోట అనుచోట కృష్ణా నదిలో సంగమించును. దీని ప్రవాహము పొడవు 22 మైళ్లు.

చంద్రవంక నదికి చంద్రభాగ యను మరియొక పేరు గలదు. చంద్రవంకనుగూర్చి పేర్కొను సందర్భములలో దీనిని చంద్రభాగ యనియే శాసనములందు వక్కాణించి యున్నారు.


1. "...శ్రీమహామండలేశ్వర రామరాజు తిరుమల
   జయదేవ మహరాజులుంగారు కుమార తిమ్మా
   నాయనింగారి నాయంక రానకు పాలించి యిచ్చిన
   నాగార్జునకొండ సీమలోని మాచెర్లకు ఉత్తర భాగాన
   చంద్రభాగా నదికి పడమర . . . ”
   (మాచెర్ల వీరభద్రాలయములోని ఎఱ్ఱరాతి బండమీది శాసన భాగము.)

2. బ్రహ్మనాయని భార్యయగు ఐతాంబ సంతానార్థము
   శ్రీ చెన్నకేశవస్వామివారిని ఆరాధించుటకు పోయి
   నపుడు కృష్ణతో సమానమగు చంద్రభాగా నదిలో
   విధ్యుక్తముగా స్నానమాడినది.

   "చంద్రభాగా నది సదృశ శైవలిని
   కలుగదు పలునాటి గడ్డయం దెల్ల
   కృష్ణకు సమ మిది కీర్త నీయంబ
   ఎడమ భాగమ్మున నెనయు చెన్నునికి
   దాపుగ బారు ఉత్తర ముఖంబునను
   స్నాన మా నది జేసి......" (పల్నాటి వీర చరిత్ర.)

3. ...... కన్నడ నాగిమయ్యాభిధానవే......
   .....ధానగ్రామే సప్తతి నివత్తన్ (న)
   పరిమితాం ప్రాదాత్ పుణ్యశా......
   ...... మహాదేవి తటాక
   చంద్రభాగానదీ ప్రవేశ ఆతుకూరి
   మాగన్ సమీపే దశనివత్తన్‌న పరిమితాం ......

ఇట్లు క థాసందర్భములను బట్టియు, స్థలవర్ణనాదికములను బట్టియు చంద్రభాగ యని పేర్కొనబడినది చంద్రవంకయే గాని మరి యొండుగాదు.

మాచెర్ల రైలుస్టేషనుకు ఎగువ 5 మైళ్ళ దూరమున నాగులవనమునకు సమీపమున ప్రకృతిశోభను ఇనుమ డించుచు చంద్రవంక తన జలమును 70 అడుగుల ఎత్తున కొండమీదినుండి ఒక సరస్సులోనికి ప్రజ్వలిత వేగముతో పడుచుండును. దీనినే “ఎత్తిపోతల" జలపాత మని వ్యవహరించెదరు. ఈ మనోహరదృశ్యమును చూచుటకు వేలమంది యాత్రికులు తరచుగా ఇచటకు వచ్చుచుందురు. ఈ సరస్సు నుండి తిరిగి చంద్రవంక ఒక మైలుదూరమువరకు అత్యంత రామణీయకమైన పచ్చని లోయగుండా ప్రవహించి కృష్ణానదిలో అంతర్భూత మగును.

దేవాలయములు : ఈ లోయ ఒడ్డుననే పశ్చిమదిశన శ్రీ రంగనాయకస్వామివారి ఆలయ మున్నది. పర్వత బిలములో లక్ష్మీదేవితోగూడిన రంగనాయకస్వామి శేషశాయియై యున్నాడు. బిలప్రదేశములో శిథిలమైన చెన్న కేశవవిగ్రహము, దక్షిణపార్శ్వమున వీరభద్రుడును దరి పైభాగమున గల గుహలలో దత్తాత్రేయస్వామి ప్రాసాదము శిథిలమయిన గుహలు, ఈశ్వరలింగము, మున్నగునవి కలవు.

జలపాతమునకు పశ్చిమ భాగపు సోపానములకుమధ్య నల్లి బిల్లిగా అల్లుకొనియున్న గురువింద తీగెలు, మొగలి పొదలు గలవు. వీటి చాటున 'చౌడేశ్వరీశక్తి' విగ్రహము ఉన్నది. దేవాలయములు జీర్ణావస్థలో నున్నవి. ఏటేటా ఫాల్గున శుద్ధ పూర్ణిమనాడు శ్రీ రంగనాయక స్వామికి భక్తులు కల్యాణమహోత్సవము జరుపుదురు. ఆషాఢ శుక్ల శయనైకాదశీ, వ్యాసపూర్ణిమలకు విశేషముగ భక్తజను లీక్షేత్రమును దర్శించెదరు. ఇచ్చటి నిర్మల, ప్రశాంత వాతావరణమును ప్రకృతి రామణీయకమును తిలకించు


579