Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/630

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంద్రగుప్త చక్రవర్తి

సంగ్రహ ఆంధ్ర

గారములు, గనులు, రాచబాటలు-మున్నగువాటి విషయములో సరియైన కట్టుదిట్టములు చేయుటకు అధికారులు జిల్లాలలో నుండుచుండిరి.

క్రొత్తగా నిర్మాణమైన ఈ సామ్రాజ్య భద్రతకు యుద్ధ శాఖా పరిపాలన పటిష్ఠత ముఖ్యావసరము. ఈ విషయములో కూడ మౌర్యులు తీసికొన్న విధానవివరములను మెగస్తనీసు వర్ణించియున్నాడు. చంద్రగుప్తుడు 6 లక్షలకు మించిన సేనానివహమును సిద్ధముగా నుంచియుండెను. యుద్ధతంత్ర కార్యాలయ నిర్వహణము 30 మంది సభ్యులు గల ఒక సంఘము ఆధీనమున నుండెను. ఈ సంఘము అయిదు ఉపసంఘములుగా విభజింపబడి—1. కాల్బలము, 2. ఆశ్వికదళము, 3. యుద్ధార్థరథములు, 4. యుద్ధార్థ గజములు, 5. రవాణాశాఖ అను అయిదును ఈ అయిదు ఉపసంఘములపర మొనరింపబడెను.

అయిదవ ఉపసంఘ విధులలో సంభార సేకరులు, యుద్ధ పరిచారకులు, కమ్మరీడులు, గడ్డికోయువారు మొదలగు వారిపై యాజమాన్యము వహించుటయు నై యుండెను. ఈ అయిదవ ఉపసంఘము పై నాలుగు ఉపసంఘములతో సహకరించుచు, భేరీనగారాలు మ్రోగించియు, కొమ్ము లూదించియు, ఆయా గుర్తులప్రకారము అందరు తమ విధులను నిర్వర్తించునట్లుగా చేయుచుండెను. పారితోషికము లిచ్చుటకు, లేక శిక్షించుటకు ఏర్పాట్లుండుటచే కార్యభద్రతకు ఎట్టి అంతరాయములు లేకుండ నుండెను.

యుద్ధభటులకు యుద్ధసమయమున తప్ప ఇతర సమయములలో తమ యిష్టానుసారము వర్తించుటకు స్వేచ్ఛ యుండెను. వారి జీతబత్తెములు ఉదారముగా నుండుటచే, వారు సౌఖ్యావహముగ జీవించుటయేగాక ఇతరులను గూడ పోషింపగలిగి యుండిరి.

రాచనగరు విలాసము : చక్రవర్తి దర్బారు అత్యంత ఆడంబరముగను, వైభవోపేతముగను ఉండెడిది. చక్రవర్తి ప్రజలకు బహిరంగముగా దర్శనమిచ్చుట ఒక విశిష్టమైన సామాజిక విశేషముగా నుండెడిది. చక్రవర్తి ఉత్సవసమయములలో బంగారు పల్లకిలో పయనించు చుండెడివాడు. ఆపల్లకిని ముత్యాలతో అలంకరించెడి వారు. అందులో బంగారు నగిషీ పనితనముగల సున్నితమయిన పట్టుమెత్తలు పరచబడెడివి. పల్లకివెంట అంగ రక్షకులు, యుద్ధవీరులు ఉండెడివారు. వీరిలో కొందరు సజీవ పక్షిబృందము కూర్చుండియున్న వృక్ష శ్రేణిని పట్టుకొని వచ్చుచుండెడివారు.

చక్రవర్తి అంతఃపురమునందున్నప్పుడు ఆతని రక్షణభారము స్త్రీలు వహించుచుండెడివారు. వేటకత్తెలతో పరివృతుడై, చక్రవర్తి మృగయా వినోదము గావించెడి వాడు, వీరందరు రథములమీదగాని, అశ్వములమీదగాని, ఏనుగులమీదగాని, పోవుచుండెడివారు. వేటసమయములో చక్రవర్తివెంట ఇద్దరో, ముగ్గురో ఆయుధదారిణులగు వనిత లుండెడివారు. రాజు వేటకుక్కలతో సింహములను వేటాడుచుండెడి వాడు. వేటతరువాత ఆయనకు ప్రియమైన వినోదక్రీడ ఎద్దుల పరుగుపందెములు, ఎద్దులు, అశ్వములు పూనినరథముల పందెములు తరువాత జంతువులు పోరులు. పండుగసమయములలో చక్రవర్తి యూరేగింపు దృశ్యము కన్నులపండువుగా నుండును. ఊరేగింపునందు రజత, సువర్ణభూషణ మండితములయిన పెక్కు గజములును, నాలుగశ్వములు లాగు చుండెడి రధములును ఉండుచుండెను. పరిచారకులు రత్నఖచితములయిన భాండములను గొని వచ్చుచుండెడి వారు. అడవిదున్నలు, చిరుతపులులు, పెంపుడు సింహములు మొదలగు అడవిజంతువులు వెంటనుండెడివి. వార్షిక అభ్యంజనోత్సవ సందర్భమున (దీపావళి సందర్భమున) హరిణములు, దుప్పులు, ఖడ్గమృగములు, మచ్చికయయిన పెద్దపులులు, చిరుతపులులు, వేటకుక్కలు, మర్కటములు, కొంగలు, బాతులు, పావురములు మొదలగువానిని చక్రవర్తికి కానుకగా నొసంగుచుండిరి. ఏదేనొక కార్యార్థమయి రాజు పురవీధుల నేగుసమయమున 24 గజములు చక్రవర్తి రక్షణమునకై వెంట నడచెడివి. ఆతనిచుట్టును తిరుగుచు, రాజునకు సమీపమున పైగా నెగురుచు సుశిక్షితమైన పెంపుడు చిలుక లుండెడివి.

చంద్రగుప్తుని ప్రాసాదము అత్యంతవైభవ సంపన్నమై రాజమర్యాదానుసారియై విరాజమానముగా నుండు చుండెడిది. ఈ ప్రాసాదమున బంగారురేకుతో కప్పబడిన స్తంభములుండెను. ఈ స్తంభముల చుట్టును ఉబ్బెత్తుగ బంగారు ద్రాక్షతీగ అల్లుకొనియుండును. ఈ తీగలమీద వెండిపిట్టల బొమ్మలతో అలంకరించెడివారు. రాజప్రాసా

572