Jump to content

పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf/622

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చంద్రగిరి

సంగ్రహ ఆంధ్ర

ఒక పెద్ద సొరంగపు మార్గము ఈ రెండింటిని కలుపుచున్నది. 'రాజమహల్' అనునది కృష్ణదేవరాయల కాలములోను 'రాణి మహల్ ' అనునది అచ్యుతదేవరాయల కాలములోను అభివృద్ధిచేయబడినవి. రాజమహల్ 150 అడుగులు పొడవుగలదై దక్షిణమునకు ఆముఖమై, మూడంతస్తులతో గంభీరముగా కనిపించును. ఈ మహల్ పై భాగమున గల గోపురములు ఆకాశమును చుంబించు చున్నట్లుగా తోపించును. వీటిలో నెల్ల పెద్ద గోపురము 24 చదరపుటడుగుల వైశాల్యముగల దర్భారుహాలుపై నున్నది. దర్భారుహాలులోని మధ్య మధ్య గోడలులేని స్తంభపంక్తి రెండవఅంతస్తు ఎత్తువరకుఉన్నది. ఈఏర్పాటు వలనదర్భారుహాలులోనికితగినంత వెలుతురు, గాలివచ్చుట కవకాశ మేర్పడినది. భవనము యొక్క పునాదులు రాతితోను, పైభాగము ఇటుకతోను, సున్నముతోను నిర్మింపబడినవి. నగిషీపని బొత్తిగా ఈ భవనము నందు లోపించియుండుట చేతను, అట్టి పనికి అచ్చటచ్చట ఏర్పాటులుచేసి, వదలిపెట్టబడి యుండుటచేతను, కట్టడపు పని పూర్తి కాలేదని ప్రేక్షకులకు గోచరించును. రాణి మహల్ నందు అట్లుగాక కొంత శిల్పచాతురి, కొంత మహమ్మదీయ సన్నగార (Stucco) పనితనము కనబడుచున్నవి.

ఈస్టిండియా కంపెనీ వారి యేజెంటుగా నుండిన ప్రాన్సిస్ డే యను నాతనికి కోటను నిర్మించుకొనుటకై చెన్నపట్టణ నివేశనస్థలమును 1639 మార్చినెలలో కౌలున కొసగబడెను. ఆ కౌలుపత్రముపై అనుమతి సంతకములు 'రాజమహలు' నందు పెట్టబడినవి.

చంద్రగిరిపర్వతము ప్రత్యేక పర్వతము. దీనిచుట్టును నల్లరాయితో దుర్భేద్యమైన జంటగోడలు కట్టబడినవి. బాహ్యప్రాకారమందు అచ్చటచ్చట బురుజులు గలవు. యుద్ధసమయమున సైనికులు ఫిరంగుల నుంచుకొనుట కనువుగా ఏర్పరుపబడిన రంధ్రములు గూడ ఆ ప్రాకారమందు కనబడును. పర్వతపువాలు ఎక్కువ నిట్రముగా నున్నచోటులం దెల్ల గోడలు కట్టబడక విడువబడియున్నవి. పర్వత పై భాగమున మంచినీటికొలను గలదు.

చిత్రము - 161

పటము - 2

రాణిమహల్


ఇమ్మడి నరసింహ యాదవరాయలు ఈ దుర్గమును కట్టించి ఈ ప్రాంతము నేలి చనగా, తరువాత పదిమంది రాజులు 314 సంవత్సరములు చంద్రగిరిని పరిపాలించి నట్లు స్థానికచరిత్ర మొకటి తెల్పుచున్నది. ఆ రాజుల నామధేయములుగాని, వారివారి రాజ్యపరిపాలన కాల పరిమితులు గాని ఆ స్థానిక చరిత్రయందులేవు. యాదవ రాయలలో తొయ యాదవరాయ లను నాతడు భగవద్రామానుజాచార్యులవారికి చంద్రగిరియం దాశ్రయ మిచ్చెనట!

సంగమవంశీయుడైన రెండవ దేవరాయలయొద్ద, మంత్రిగా, దండనాయకుడుగా వ్యవహరించిన మల్లన ఒడయరు క్రీ. శ. 1418 లో చంద్రగిరి రాజ్యమును ఇరుగప్ప ఒడయరునుండి పొందినట్లు తెలియుచున్నది. మల్లన తరువాత సాళ్వపెరియ మల్లన దేవరాయలీ చంద్రగిరిని ఏలెను. సంగమవంశీయులక్రింద సాళ్వ వంశీయులు సామంతులుగ నుండిరి. వీరిలో సాళ్వనృసింహరాయలు తొలుత కల్యాణపురమున కధిపతిగా నుండెను. చంద్రగిరి దుర్గము బలిష్ఠమైనదనియు, శత్రుదుర్భేద్య మనియు మంత్రులచే విన్నవాడై తన రాజధానిని సాళ్వనరసింహరాయలు కల్యాణపురమునుండి చంద్రగిరికి మార్చుకొనెను. ఈ మార్పువలన తూర్పుతీరమున విజృం

564